
మహిళలు సహా 17 మంది రైతుల అరెస్టు
పళ్లిపట్టు: రైతుల పోరాటాన్ని పోలీసులు అడ్డుకుని, మహిళలు సహా 17 మంది రైతులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నుంచి దిండివనం వరకు 186 కి.మీ దూరం రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రైల్వే అధికారులు రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని, పనులు నిర్వహిస్తున్నారు. పళ్లిపట్టు యూనియన్‌లోని పాండ్రవేడు వద్ద రైలు మార్గం కోసం చెరువుతోపాటు మడుగును మట్టి పోసి పూడ్చుతున్నారు. దీంతో తమకు తాగునీటికి కష్టాలతోపాటు రెండు వేల ఎకరాల పంట భూములకు నీరందని పరిస్థితులు తలెత్తుతాయని, వెంటనే ప్రత్యామ్నయ మార్గంలో రైలు మార్గం పనులు చేపట్టాలని పాండ్రవేడు గ్రామానికి చెందిన రైతులు రైల్వే అధికారులను కోరారు. అయితే ఏమాత్రం పట్టించుకోకుండా చెరువులో రైల్వే మార్గం పనులు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు సోమవారం ఉదయం రైలు మార్గం పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పోలీసులు మొహరించి, అడ్డుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా పోరాటం చేపట్టారంటూ ఇద్దరు మహిళలసహా 17 మందిని పోలీసులు అరెస్టు చేసి, పొదటూరుపేటలోని పోలీసు సముదాయ భవనానికి తీసుకెళ్లారు. వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు.

మహిళలు సహా 17 మంది రైతుల అరెస్టు