
నటి మేఘ్నా స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: నటి మేఘ్నా కథానాయకిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించి, సంగీతాన్ని అందించిన చిత్రం 13/13 ఎన్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు. నటుడు ఎస్‌వీ.శేఖర్, తంబిరామయ్య, నట్టి, తేనప్పన్, దర్శకుడు కన్నన్, జయకుమార్, కళాదర్శకుడు రామలింగం తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. నటుడు తంబిరామయ్య మాట్లాడుతూ పలు ఏళ్ల తరువాత తమిళసినిమాలో ఒక కథానాయకి చిత్రానికి దర్శకత్వం వహించి, సంగీతాన్ని సమకూర్చి, నిర్మించారని, ఆమెను మనమంతా స్వాగతించాలని పేర్కొన్నారు. సినిమా రంగంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చునని, అయితే ప్రతిభ, శ్రమ, అంకిత భావం ఉంటే జయించవచ్చునని అన్నారు. చిత్ర కథానాయకి, దర్శక నిర్మాత మేఘ్నా మాట్లాడుతూ ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కథా, కథనాలు ఉత్కంఠభరితంగా సాగుతాయని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను మలేషియా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

నటి మేఘ్నా స్వీయ దర్శకత్వంలో..