
నైరుతి.. అలర్ట్
● విపత్తులను సమర్థంగా ఎదుర్కొందాం ● ముందస్తు జాగ్రత్తలపై దృష్టి ● అధికారులతో సీఎం సమీక్ష ● సాగు విస్తీర్ణం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ ● మేట్టూరు నీటి విడుదలపై అధ్యయనం
సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చైన్నె నగరం, శివారు జిల్లాలో ఆదివారం రాత్రంతా అనేక చోట్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. విల్లుపురం, కళ్లకురిచ్చి, మదురై, కోయంబత్తూరు, నీలగిరి, దిండుగల్, తెన్‌కాశి, విరుదునగర్, ఈరోడ్, తిరుప్పూర్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, నామక్కల్, తిరుపత్తూరు, తిరువణ్ణామలై తదితర 17 జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా మారింది. అప్పుడప్పుడూ చెదురు ముదురుగా, మరికాసేపు భారీగా అనేక చోట్ల వర్షం పడుతోంది. మంగళ, బుధవారాల్లోనూ వర్షాలు కొనసాగనున్నాయి. అత్యధికంగా కళ్లకురిచ్చి జిల్లా రిషివందియంలో 14 సెం.మీ వర్షం పడిందివ. నైరుతి రుతు పవనాలు ఒకటి రెండు రోజులలో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం తమిళనాడులోని పలు జిల్లాల మీద పడటం ఖాయం. ఈ పరిస్థితుల్లో ఆయా జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు పనులపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. నామక్కల్‌కవింజ్ఞర్ మాళిగై సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో నైరుతి రుతు పవనాలకు సన్నద్ధం అయ్యేందుకు చేపట్టాల్సిన ముందస్తు కసరత్తులు, మేట్టూరు జలాశయం నీటి గురించి సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్షించారు.
సమర్థవంతంగా..
ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలలో, అనేక విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఈ సీజన్‌లలో మొదటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలను కాపాడడమే అన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా తుపానులు, వరదల, భారీ వర్షాలు వంటి విపత్తులు సంభవిస్తూ వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్‌లోకి అడుగిడుతున్నామని దీనిని కూడా సమర్థంగా ఎదుర్కొందామని పిలుపు నిచ్చారు. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ ముందు జాగ్రత్తలో సర్వం సిద్ధం చేసుకుందామని సూచించారు.
జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు
ఈ సీజన్‌లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుందామని పేర్కొంటూ, సాధారణంగా ఈ సీజన్లో కావేరి డెల్టా జిల్లాలు, నీలగిరి కొండలు, పశ్చిమ కనుమల వెంబడి జిల్లాల మీద అధిక ప్రభావం ఉంటుందని గుర్తు చేస్తూ, భారీ వర్షాలు, తుపానులను ఎదుర్కోవడానికి అన్ని జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టరుల అధికారులతో సమీక్షించి జిల్లా స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ సెంటర్, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24 గంటల సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఉండాలని సూచించారు. కమ్యూనికేషన్ పరికరాలు, రెస్క్యూ పరికరాలు, రికవరీ వాహనాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని, విద్యుత్, ఆహారం, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. విపత్తు నిర్వహణ ప్రణాళిక – సమాచారం, కమ్యూనికేషన్ ప్రణాళిక – ప్రాథమిక రక్షణ, సేవలకు సంబంధించిన జాబితాతో పాటూ సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. అప్రమత్తత కారణంగా విపత్తుల సమయంలో తలెత్తే అనేక ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలలో వచ్చే సమాచారాలు, ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు, ఫిర్యాదు చేసే వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారికి కావాల్సిన సాయం అందించాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ఆకస్మిక విద్యుత్తు అంతరాయం, ముందుగా ప్రకటించిన మేరకు విద్యుత్ సరఫరా నిలుపుదల , విద్యుత్ నిర్వహణ పనుల గురించిరన సమాచారాన్ని వినియోగదారుడి సెల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయాలన్నారు. అంతేకాదు, వారి వారి ప్రాంతంలో విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో అనే సందేశాన్ని కూడా పంపించాలని స్పష్టం చేశారు.
కురువై సాగుకు..
మేట్టూరు జలాశయం నీటి మట్టం శనివారం నాటికి 108.33 అడుగులకు చేరిందని గుర్తు చేస్తూ జూన్ 12న కరువై సాగు నిమిత్తం నీటి విడుదలకు సంబంధించి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కావేరి, దాని ఉప నదులు, కాలువలు, తదితర వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, కురువై సాగుబడికి సంవృద్ధిగా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు ప్రణాళికలు, వాటి ప్రయోజనాలు రైతులకు దరిచేరే విధంగా ఫీల్డ్ ఆఫీసర్లు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. నైరుతి రుతుపవనాల కాలంలో ప్రాణ, ఆస్తి నష్టం, మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అందరూ కలిసి కట్టుగా పూర్తి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ పరిపాలన విభాగం, రెవెన్యూ విభాగం, వ్యవసాయం – రైతు సంక్షేమ శాఖ, రహదారులు , చిన్న ఓడరేవుల శాఖ, జలవనరులు, నిఘా విభాగాల కార్యదర్శులు తమ తమ విభాగాల తరపున సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జలవనరుల మంత్రి దురైమురుగన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మునిసిపాలిటీ, పరిపాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ, ప్రజా పనులశాఖ మంత్రి ఏ.వి. వేలు, వ్యవసాయ – రైతు సంక్షేమశాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, మత్స్యశాఖ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్, రవాణా, విద్యుత్ శాఖ మంత్రి మంత్రి ఎస్.ఎస్. శివశంకర్, హిందూ మతం, దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, సీఎస్ మురుగానందం, డీజీపీ శంకర్ జివాల్ తదితరులు పాల్గొన్నారు.

నైరుతి.. అలర్ట్