
రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పోరాటాలు
సాక్షి, చైన్నె : 10.5 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తమిళనాట పోరాటాలకు వన్నియర్ సంఘాల భేటీలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్బుమణి రాందాసు డుమ్మాకొట్టారు. పీఎంకేలో సాగుతున్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి రాందాసు, తనయుడుఅ న్బుమణి మధ్య సాగుతున్న ఈ సమరంలో నేతలు నలిగి పోతున్నారు. ఈ పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో, ఆతర్వాత జిల్లాల కార్యదర్శులతో, యువజన నేతలతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తైలాపురం తోట్టం వేదికగా సమావేశం అవుతూ వచ్చారు. ఈసమావేశాలను అన్బుమణి బహిష్కరించారు. సోమవారం పార్టీకి కీలకంగా ఉన్న వన్నియర్ సంఘాల నేతలతో సమావేశం జరిగింది. దీనికి సైతం అన్బుమణి గైర్హాజరయ్యారు. పీఎంకే గౌరవ అధ్యక్షుడు జికేమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావణన్, వన్నియర్ సంఘాల అధ్యక్షుడు అరుల్ మొళిలతో పాటూ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. ఇందులో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికలలో వన్నియర్ సంఘాలు, సామాజిక వర్గాల బలాన్ని చాటే విధంగా కార్యక్రమాల విస్తృతానికి నిర్ణయించారు. అలాగే 10.5 శాతం రిజర్వేషన్ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పోరాటాలకు నిర్ణయించారు. ఈసందర్భంగా జికే మణి మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో ఎలాంటి వివాదాలు లేవు అని, రాందాసుతో కలిసి అన్బుమణి పార్టీని నడిపిస్తారని స్పష్టం చేశారు. పార్టీకి వారే నాయకత్వం వహిస్తారని, బలోపేతం దిశగా దూసుకెళ్తామన్నారు.
వన్నియర్ సంఘాల నేత భేటీలో రాందాసు నిర్ణయం
డుమ్మాకొట్టిన అన్బుమణి