
గంగమ్మ అభయం.. ఆనందమయం
● భక్తిశ్రద్ధలతో గంగమ్మ నిమజ్జనం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలో బుధవారం గంగమ్మ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండో రోజు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గజమాలలు, చీరలు, నైవేద్యం సమర్పించారు. అమ్మవారి మెడలోని నిమ్మకాయల కోసం పోటీ పడ్డారు. సాయంత్రం వంశపారంపర్య ధర్మకర్తలు ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు చేసి చిత్తూరు నడివీధి గంగమ్మ జలాధి పూజలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు కదిలింది. భక్తులు అమ్మవారిని కనులారా వీక్షించేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు ఊరేగింపు సాగింది. చివరకు కట్టమంచి చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.