
మృగాళ్లకు మరణ శిక్ష
సాక్షి, చైన్నె చదువుకుంటున్న విద్యార్థినులు, తమ సన్నిహిత మహిళలు, యువతులను పొల్లాచ్చి శివారులోని గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి వారిని బలవంతంగా వాడుకున్నారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతూ ఎందరో జీవితాలను సర్వనాశనం చేసిన సంపన్న ఇంటి బిడ్డల భాగోతం 2019లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంపన్న ఇంటి పిల్లలే కాదు, రాజకీయ నాయకుల వారసులు సైతం ఉన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు, ప్రచారాలు హోరెత్తాయి. అప్పట్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు చెందిన నాయకుల వారసుల పేర్లు అనేకం తెర మీదకు వచ్చాయి. దీంతో పోరాటాలు భగ్గుమన్నాయి. నిందితులను అరెస్టు చేయాలంటూ డీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు ఉధృతం చేశాయి.
సీబీఐ విచారణ
రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించడమే కాదు, రాజకీయ దుమారానికి ఈ వ్యవహారం దారి తీయడంతో తొలుత పొల్లాచ్చి పోలీసులు, ఆ తర్వాత సీబీసీఐడీ పోలీసులు కేసును విచారించారు. చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతూ యువతుల జీవితాలతో చెలాగాటం ఆడుతున్న కోయంబత్తూరు, పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు(25), శబరిరాజన్(25), సతీష్(28), వసంత కుమార్(27), మణివణ్ణన్ (28), హెరన్‌పాల్(29), బాబు (27), అరులానందం(34), అరుణ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇందులో ఒకరు అన్నాడీఎంకే నిర్వాహకుడు కావడంతో వివాదం మరింతగా రాజుకుంది. నిందితులకు వ్యతిరేకంగా మహిళా న్యాయ వాదులు సైతం కన్నెర్ర చేశారు. వీరికి అందరు న్యాయవాదులు మద్దతు పలికారు. నిందితుల తరఫున ఏ ఒక్కరూ కోర్టు విచారణకు హాజరు కాకుండా తీర్మానించారు. నిందితులను విచారణ సమయంలో పలు మార్లు కోర్టుకు తుపాకీ నీడలో తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆరేళ్లు విచారణ
2019 మే 21 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు మహిళా కోర్టులో వాయిదాల పర్వంతో కొనసాగుతూ వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు, వివాదాలు సాగాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి నందినీ దేవిని 2023లో బదిలీ చేశారు. చివరకు హైకోర్టు జోక్యంతో ఈ కేసు విచారణ ముగిసే వరకు న్యాయమూర్తిగా నందినీ దేవి కొనసాగారు. కేసు విచారణను ముగించారు. బాధితుల వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
మరణించే వరకు జైలు
కేసు విచారణను ముగించిన న్యాయమూర్తి నందినీ దేవి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితులకు మరణించే వరకు జైలు శిక్ష అని ప్రకటించారు. ఈ సమయంలో నిందితులు తీవ్ర కలవరంలో పడ్డారు. కోర్టు పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. బాధితులైన ఎనిమిది మంది యువతులకు రూ.85 లక్షలు నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. పలు సెక్షన్ల ఆధారంగా కేసులో శబరి రాజన్‌కు నాలుగు యావజ్జీవాలు, తిరునావుక్కరసర్‌కు ఐదు యావజ్జీవాలు, మణివణ్ణన్‌కు కూడా ఐదు యావజ్జీవాలు, సతీష్‌కు మూడు, వసంతకుమార్‌కు రెండు, బాబుకు ఒకటి, అరులానందం, అరుణ్‌కుమార్, హెరన్ పాల్‌లకు మూడు చొప్పున యావజ్జీవ శిక్షలు విధించారు. అన్ని శిక్షలను వీరు ఏక కాలంలో అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు సమయంలో కోర్టుకు వచ్చిన నిందితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వీరందర్నీ నిఘా నీడలో కారాగారానికి తరలించారు. మృగాళ్లకు మరణించే వరకు జైలు శిక్ష అని కోర్టు తీర్పు వెలువరించడంతో మహిళా సంఘాలు, పొల్లాచ్చివాసులు ఆనందంతో రంకెలు వేశారు. ఆరేళ్లకు నిందితులకు సరైన శిక్ష పడిందని ఆనందం వ్యక్తం చేస్తూ, బానసంచా పేలుళ్లతో హోరెత్తించారు. స్వీట్లు పంచి పెట్టారు.
మరణించే వరకు జైలు
పొల్లాచ్చి కేసులో కోయంబత్తూరు మహిళా కోర్టు తీర్పు
సర్వత్రా సంబరాలు
బాణసంచా హోరు, స్వీట్ల పంపిణీ
బాధిత మహిళలకు రూ.85 లక్షల పరిహారం
స్నేహం ముసుగులో మాయమాటలు చెప్పి విద్యార్ధినులను, యువతులను బలవంతంగా లొంగ తీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడిన మృగాళ్లకు మర ణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తొమ్మిది మంది కామాంధులకు శిక్ష పడ్డ సమాచారంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా హోరుతో, స్వీట్లు పంచి పెట్టారు.
సర్వత్రా హర్షం
కేసు తీర్పుతో పొల్లాచ్చి, కోయంబత్తూరులలో సంబరాలు మిన్నంటాయి. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్లు సాగించిన పోరాటాలకు న్యాయం లభించిందని మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అన్నాడీఎంకే హయాంలో కేసును తుంగలో తొక్కే ప్రయత్నం చేశారని, సీబీఐ రంగంలోకి దిగడంతోనే నిందితుల గుట్టురట్టైందన్నారు. సీఎం స్టాలిన్ స్పందిస్తూ తీర్పును ఆహ్వానిస్తున్నామన్నారు. అన్నాడీఎంకేకు చెందిన వారితోపాటుగా నిందితులకు సరైన శిక్షపడిందని, బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ బాధితుల తరఫున డీఎంకే మహిళా విభాగం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. బాధిత యువతులకు న్యాయం దక్కిందన్నారు. అన్నాడీఎంకే తరఫున విడుదల చేసిన ప్రకటనలో ఈ కేసును సరైన సమయంలో సీబీఐకు తమ నేత పళణి స్వామి అప్పట్లో అప్పగించడంతోనే నిందితులకు ప్రస్తుతం శిక్ష పడిందన్నారు.