ఎన్డీయేలో ఉన్నట్టా.. లేనట్టా...?
● అన్బుమణి దాటవేత ● యువజనోత్సవానికి పందిరి గుంజం
సాక్షి, చైన్నె: ఎన్‌డీఏ కూటమిలో పీఎంకే ఉన్నట్టా..? లేనట్టా.? అన్న ప్రశ్నకు పీఎంకే నేత అన్బుమణి రాందాసు ఇప్పుడు సమాధానం ఇవ్వలేనంటూ దాట వేశారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో పీఎంకే పయనించిన విషయం తెలిసిందే. తాజాగా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలోకి బీజేపి చేరింది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి, తమిళనాడులో పళని స్వామి నేతృత్వంలోని కూటమి అన్న దిశగా ఎన్నికల ప్రయాణం మొదలైంది. అదే సమయంలో పీఎంకేలో అధ్యక్షుడు ఎవరు అన్న వివాదం తారా స్థాయికి చేరి ఉంది. పీఎంకే అధ్యక్షుడి తానే అంటూ వ్యవస్థాపకుడు రాందాసు, కాదు..కాదు సర్వ సభ్యం ద్వారా ఎంపికై న తానే అంటూ అన్బుమణి రాందాసు వాదులాడుకుంటున్నారు. ఈ ఇద్దర్ని బుజ్జగించే విధంగా పార్టీ వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్బుమణి రాందాసుతో పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి బుధవారం భేటీ అయ్యారు. చెంగల్పట్టు సమీపంలోని తిరువిడందైలో చిత్ర పౌర్ణమి రోజున జరగనున్న పీఎంకే యువజనోత్సవం మహానాడు పనులకు పందిరి గుంజం నాటే కార్యక్రమానికి హాజరైన అన్బుమణిని మీడియా ప్రశ్నించగా, అన్నింటికి మౌనం వహిస్తూ, దాట వేత ధోరణి సమాధానాలు ఇచ్చారు. చివరకు ఎన్‌డీఏలో పీఎంకే ఉన్నట్టా...? లేనట్టా..? అని ప్రశ్నించగా, ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఇవ్వలేనని, మళ్లీ చూసుకుందామని దాట వేయడం గమనార్హం. ఈ దృష్ట్యా, పీఎంకే ఎన్‌డీఏలో ఉన్నట్టా..? లేదా మరెదేని ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టినట్టా..? అన్న చర్చ ఊపందుకుంది.


