కేర్ బేర్స్ బ్రోచర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అంగన్ వాడీలు, కిండర్ గార్డెన్లలోని పిల్లలకు ఉచిత పీడియాట్రిక్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ నిమిత్తం ‘కేర్ బేర్స్’ను ఏర్పాటు చేశారు. సిమ్స్ ఆస్పత్రి నేతృత్వంలో ఈ వైద్య సేవలు జరగనున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మంది పిల్లలకు వైద్య సేవలకు నిర్ణయించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ‘ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు’ అనే ఇతివృత్తంతో అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలకు వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘కేర్ బేర్స్ – నర్సరింగ్ ది ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉచితంగా పిల్లలకు ఆరోగ్య పరంగా హెల్త్ చెకప్ చేయనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ కళానిధి వీరాస్వామి హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో సిమ్స్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజు శివస్వామి మాట్లాడుతూ ‘కేర్ బేర్స్’ ద్వారా, పిల్లలకు ఆరోగ్యకరమైన సేవలు అందించనున్నామన్నారు. హెల్త్ చెకప్, ఏదైనా రుగ్మతలు వంటి వాటి నివారణ, పిల్లల సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సు విషయానికి వస్తే ఏ బిడ్డ కూడా వెనుకబడి ఉండకుడదని, అందుకే ‘కేర్ బేర్స్’ చైన్నె అంతటా అంగన్ వాడీ, కిండర్ గార్డెన్లలోని పిల్లలకు వైద్య సేవలను అందిస్తుందన్నారు. 2025 చివరి నాటికి 10,000 మంది పిల్లలకు వైద్య పరంగా సేవలు అందించనున్నామన్నారు.


