మత్స్యకారులకు మహర్దశ
● 576 కోట్లతో పథకాలు
● రూ. 150 కోట్లతో తంగచ్చి మఠంలో హార్బర్
సాక్షి,చైన్నె: మత్స్యకారుల సంక్షేమాన్ని, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక ప్రకటన చేశారు. రూ. 576 కోట్లతో పథకాలను ప్రకటించారు. రూ. 150 కోట్లతో తంగచ్చి మఠంలో హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఇందులో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. మంత్రి పొన్ముడి మాట్లాడుతూ, గ్రీన్ తమిళనాడు ఇయక్కం ద్వారా 33 శాతం మేరకు పచ్చదనాన్ని నింపినట్టు వివరించారు. మొక్కల పెంపకాన్ని విస్తృతం చేశామన్నారు. మంత్రి ఏవీ వేలు మాట్లాడుతూ, చైన్నె హార్బర్ టూ సెయ్యారు సిప్ కాట్ వరకు జరుగుతున్న రోడ్డు పనులను తిరువణ్ణామలై వరకు పొడిగించనున్నట్టు ప్రకటించారు. కులితలై ఆస్పత్రికి కలైంజ్ఞర్ కరుణానిధి పేరు పెట్టేందుకు పరిశీలిస్తామని మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. చైన్నెలోని పోరూర్ చెరువును అభివృద్ధి పరిచేందుకు రూ. 63 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించామని మంత్రి దురై మురుగన్ పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రకటన
తమిళనాడు మత్స్యకారుల సంక్షేమం గురించి శాసనసభ నిబంధనలు 110 మేరకు సీఎం స్టాలిన్ ప్రత్యేక ప్రకటన చేశారు. శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులు, తమిళ జాలర్ల అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించారు. మత్స్యకారుల సమస్యపై గతవారం సభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కచ్చదీవులను మళ్లీ స్వాధీనం చేసుకోవడం ద్వారానే సాధ్యమని వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తమిళ జాలర్ల సంక్షేమంపై ఎలాంటి చిత్తశుద్ధిని కనబరచక పోవడం శోచనీయమన్నారు. తమిళ జాలర్ల విషయంగా ఎలాంటి ప్రస్తావన ఈ పర్యటనలో లేక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. జాలర్ల సమస్యకు విముక్తి కల్పించే కచ్చతీవు గురించి చర్చ కూడా లేక పోవడం శోచనీయమని విమర్శించారు. తమిళ జాలర్ల డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారని మండి పడ్డారు. ఈపరిణామాలు మత్స్యకారుల జీవనోపాధిని ప్రమాదంలోకి నెడుతోన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం,అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం వంటివి అంశాలను పరిగణించి ప్రస్తుతం వివిధ కొత్త ప్రాజెక్టుల అమలుకు నిర్ణయించామని ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతాలు ముఖ్యంగా మన్నార్ గల్ఫ్ పరిధిలో ఉన్న జిల్లాలు, రామనాథపురం, నాగపట్నం, తూత్తుకుడి, పుదుక్కోట్టై, తిరువారూర్, తంజావూరు మత్స్యకారుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామాన్నరు. ఈ ప్రాంతాల నుండి చేపల వేటకు వెళ్లే జాలర్లు ఎదుర్కొంటున్న కష్టాలు,నష్టాలు పరిగణించామన్నారు. మన్నార్ గల్ఫ్ పరిసరాల నుంచి మత్స్యకారులు లోతైన సముద్రంలో చేపల వేట కోసం దక్షిణం వైపు వెళ్తున్నారని గుర్తు చేశారు. దీనిని మరింత సులభతరం చేసే విధంగా వీరు హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా ఫ్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా తంగచ్చి మఠంలో రూ.150 కోట్లతో ఫిష్షింగ్ హార్బర్ నిర్మించనున్నామని ప్రకటించారు. పాంబన్ ప్రాంతంలో అంచనా రూ.60 కోట్ల అంచనా వ్యయంతో, కుందగల్ ప్రాంతంలో రూ. 150 కోట్లతో ఫిష్షింగ్ హార్బర్ పనులు చేపట్టనున్నామన్నారు. ఇది మన్నార్ గల్ఫ్ ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధిని నిర్ధారించడానికి మార్గంగా ఉంటుందన్నారు.
ప్రాజెక్టులు..
సముద్రపు పాచి పెంపకం, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, అమ్మకాలకు సంబంధించిన ఉద్యోగాలకు సాంకేతిక శిక్షణ అవసరం అని పేర్కొన్నారు. సుమారు 7 వేల మంది లబ్ధిదారులకు రూ. 52 కోట్లతో అవసరమైన సాంకేతిక సంబంధిత పరికారాలను అందించనున్నామన్నారు. . చేపలు, మట్టి పీతల బోను పెంపకం, ప్రాసెసింగ్, అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాలను చేపట్టడానికి మత్స్యకారులలో 25 మందిని ఎంపిక చేయనున్నామని, సంబంధిత సేవల కోసం రూ. 82 కోట్లు ప్రకటించారు. చేపల ప్రాసెసింగ్, చేపల ఎండబెట్టడం సాంకేతికతలు, సాంకేతిక పరికరాలు శిక్షణను అందించే ప్రాజెక్టుకు నిర్ణయించామన్నారు. ఈ మేరకు 2,500 మత్స్యకార కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 9 కోట్ల 90 లక్షలలతో పథకం అమలు చేయనున్నామన్నారు. సుమారు 15,300 మంది మత్స్యకారులకు, చేపలు చచేపల సంబంధిత అంశాలపై సాంకేతిక శిక్షణను రూ. 55 కోట్లతో అందించనున్నామన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిలో వల నేయడం, మరమ్మతు, పడవల నిర్మాణ పరిశ్రమ, పడవల మరమ్మత్తు, వడ్రంగి తయారీ, రంగురంగుల చేపల ట్యాంకులను తయారు చేయడం, పడవ డ్రైవింగ్ శిక్షణ, సముద్రపు గవ్వల అలంకరణ, తయారీకి రూ. 54 కోట్లు కేటాయించామన్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, పుట్టగొడుగుల పెంపకం, పర్యాటక బోటింగ్, చేతిపనుల తయారీ, ఇంట్లోనే మసాలా పొడి తయారీ, చిరు ధాన్యపు ఆహారం తయారీ వంటి వాటిపై దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందు కోసం రూ. 53 కోట్లు కేటాయించామన్నారు. ఫిష్షింగ్ హార్బర్‌లకు రూ. 360 కోట్లు.ఇతర ప్రత్యామ్నాయ అంశాలకు రూ. 216 కోట్లు అంటూ మొత్తంగామత్స్యకారుల కోసం రూ. 576 కోట్లతో ప్రాజెక్టులను అమలు చేయన్నామన్నారు.
ఆర్థికంగా మత్స్య కారులను బలోపేతం చేయడం, వారికి ప్రయోజనం కల్పించే ప్రత్యామ్నాయం మార్గం మీద విస్తృత చర్యలు ఉంటాయని ప్రకటించారు.అనంతరం సభలో ఎంఎస్‌ఎంఈ శాఖకు నిధుల కేటాయింపు ప్రక్రియ గురించి మంత్రి అన్బరసన్, గృహ నిర్మాణ పథకాలకు నిధుల కేటాయింపు గురించి మంత్రి ముత్తుస్వామి, హిందూ ధర్మాదాయ శాఖ వైభవాన్ని చాటేందుకు కేటాయించిన నిధుల గురించి మంత్రి శేఖర్‌బాబు సభలో వివరాలను ప్రకటించారు.


