రామా...శ్రీరామ...!
●తెలుగింట నవమి సంబరాలు
●కనుల పండువగా సీతారామ కల్యాణ మహోత్సవం
●భక్తిభావాన్ని చాటిన తెలుగు
సంఘాల వేడుకలు
ఆస్కాలో ...
ఆంథ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జరిగింది. ఆస్కా అధ్యక్షుడు కె. సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈవేడుకల్లో సీతారాములను విశేషంగా అలంకరింపజేసి వేదపండితులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. సీతారాములకు విశేషంగా పూజలను చేసి ఆశీస్సులు అందుకున్నారు . ఈవేడుకల్లో ఆస్కా సభ్యులు వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకుపాత్రులయ్యారు.
సాక్షి, చైన్నె: రామా..శ్రీరామా...జయ జయ రామా నామస్మరణ ఆదివారం తెలుగింట మిన్నంటింది. శ్రీరామనవమి సంబరాలను తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంఘాల నేతృత్వంలో భక్తి భావాన్నిచాటే విధంగా పూజాది కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. చైన్నెతో పాటూ రాష్ట్రంలోని పలు నగరాలలో ఉన్న తెలుగు వారు గత వారం ఉగాది సంబరాలను అత్యంత వేడుకగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఆదివారం శ్రీరామనవి పర్వదినాన్ని భక్తి భావంతో నిర్వహించారు. సీతారాములకు పూజాది కార్యక్రమాలు, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలను తయారు చేసి ఇంటిళ్లి పాదికే కాకుండా ఇరుగు పొరుగు వారికి పంచి పెట్టారు. తెలుగు సంఘాల నేతృత్వంలో వేర్వేరుగా అత్యంత వేడుకగా జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. టినగర్‌లోని శ్రీవారి ఆలయంలో టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలతో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని శ్రీరాముడి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.
చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో:
చెన్నె తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు చైన్నె పోరూరు, ఆర్కాట్ రోడ్‌లోని రాజలక్ష్మి మహల్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేడుకలు జురిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలతో సీతారామ కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు కల్యాణాన్ని తనివితీరా తిలకించారు. వీరికి ప్రసాదాలు, తలంబ్రాలు అందజేశారు. అందరికీ కల్యాణ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీటీఏ అధ్యక్షుడు కె.గోపాలకృష్ణ రెడ్డి, కార్యదర్శి బి.వెంకయ్య నాయుడు, ఉపాధ్యక్షులు గాడిపర్తి సురేష్, విజయేంద్రరావు, కోశాధికారి నాగరాజు, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ ఏవీ శివకుమారి, జాయింట్ సెక్రటరీలు రామయ్య, శ్రీనుబాబు, కమిటీ సభ్యులు మదుకర్, వెంకట రమణయ్య, రామ్ ప్రసాద్, అడ్వైజరీ కమిటీ సభ్యులు చలపతి, పి.వి.రవికుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఆంధ్ర కళా స్రవంతిలో..
చైన్నె కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళాస్రవంతి తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 36వ వార్షిక శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరిగింది. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు. ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణోత్సవ తంతు ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి దీపారాధన, అర్చనతో భక్తుల సందర్శనం కల్పించారు. పండితుడు కుటుంబశాస్త్రి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ వేడుకగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన శ్రీరామభజన కార్యక్రమం జరిగింది. ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు, సలహాదారుడు ఎంఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవీ రమణ పర్యవేక్షణలో నిర్వహించిన కల్యాణోత్సవాల్లో ఉపాధ్యక్షులు వీఎన్ హరినాథ్, కేఎన్ సురేష్ బాబు, పి సరస్వతి తదితరులు తగిన ఏర్పాటు చేశారు.
సీతారామనగర్‌లో..
మూలకడై సమీపంలోని సీతారామనగర్‌లోని సీతారామనగర్ తెలుగుప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 28వ వార్షిక శ్రీసీతారాముల కల్యాణమహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. సంఘ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో తెలుగు సంప్రదాయాలకు అద్దంపడుతూ దైవదంపతులు సీతారాములను భక్తులు రామ నామస్మరణ, మేళతాళాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అధ్యక్షులు బి.సురేష్ బాబు, కార్యదర్శి పి.లక్ష్మణ రావు, కోశాధికారి డి.పిచ్చేశ్వరరావుతోపాటూ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీనివాసకుమార్, బి.శ్రీధర్ పి. బాలాజీ, డి.సాంబశివరావు, సీఎస్.జయకుమార్, ఎన్. సతీష్, జె.మధుసూధన్, పి.సుబ్బరాజు, టి. నాగరాజు, డి.వినోద్కుమార్లతో పాటు వంజరపు శివయ్య తదితరులు పాల్గొన్నారు.
ట్రిప్లికేన్ రామనగర్‌లో..
తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న ట్రిఫ్లికేన్‌లోని రామనగర్‌లోని శ్రీ కోదండరామ భక్తజన మందిరం వద్ద శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాములను అలంకరించి ప్రత్యేక పూజలు అనంతరం మాంగల్యాధారణ చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమం జరిగింది. సీతారాముల ఊరేగింపు కనుల పండువుగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామనగర్ ఆది ఆంధ్ర సంక్షేమ సంఘం, శ్రీ కోదండ రామభక్తజన బృందం, శ్రీరామదాసాంజనేయ స్వామి ఆలయ కార్యవర్గ సభ్యులు , పెద్దలు , యువకులు అందరూ కలసి జయప్రదం చేశారు.
ఎస్‌కేపీడీలో..
ఎస్‌కేపీడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. చైన్నె జార్జిటౌన్‌లోని 300 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం(ఎస్‌కేపీడీ)లో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం సీతారాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. హంస వాహనం ఉంచి పూజలు చేశారు.
కమనీయం..కల్యాణం
తిరుత్తణి: శ్రీ రామనవమి వేడకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తిరుత్తణి సమీపంలోని చత్రంజయపురంలో శ్రీరామనవమి సందర్భంగా రామభజన మందిరంలో ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహోమ గుండ పూజలు చేశారు. ఉదయం ఆలయ గోపురానికి పవిత్ర పుణ్యతీర్థాలతో మహాకుంభాభిషేకం చేశారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణోత్సవం తిలకించి పునీతులయ్యారు. సాయంత్రం స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. వేలంజేరిలోని శ్రీరామ భజన ఆలయంలో ఉదయం స్వామికి అభిషేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. అనంతరం స్వామివారు గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుత్తణిలోని ఆనుమంతపురంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైయ్యాయి.
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో శ్రీరామనవమిని పురష్కరించిని ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరు రంగాపురంలోని కోదండరాముడి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలో ప్రతిష్టించిన పట్టాభిషేక రాముడికి మహా అభిషేకం, పుష్పాలంకరణచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేదపండితులు మంత్రాలు చదివి పూజలు చేసి దేశ క్షేమం కోసం ప్రత్యేక యాగ పూజలు చేశారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోని రాముడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
రామా...శ్రీరామ...!
రామా...శ్రీరామ...!


