‘నీట్’ మినహాయిస్తేనే పొత్తు
● బీజేపీని డిమాండ్ చేసే ధైర్యం ఉందా?
● అన్నాడీఎంకేకు స్టాలిన్ సూటి ప్రశ్న
● నీలగిరిలో విస్తృతంగా పర్యటన
సాక్షి, చైన్నె : నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పిస్తేనే కూటమి అని బీజేపీతో ఖరాఖండిగా తేల్చి చెప్పే ధైర్యం ఉందా? అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి సీఎం స్టాలిన్ సవాల్ విసిరారు. ఆదివారం నీలగిరి ప్రగతిని కాంక్షిస్తూ ఊటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. భారీ ఆస్పత్రిని ప్రారంభించారు. నీలగిరుల ప్రగతికి ఆరు కొత్త పథకాలను ప్రకటించారు. నీలగిరి జిల్లా కేంద్రం ఊటిలో రూ. 143.69 కోట్లతో బ్రహ్మాండ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 700 పడకలతో అత్యవసర, అత్యాధునిక వైద్య చికిత్స విభాగాలతో రూపొందించిన ఈ ఆస్పత్రిని ఆదివారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఆస్పత్రిలోని శస్త్ర చికిత్స విభాగాలు, ఔట్ పేషంట్ విభాగం, ఇతర వైద్య సంబంధిత విభాగాలు, అక్కడి పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీలగిరి జిల్లాలోని గిరిజన ప్రజలు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సీఎంకు ఆహ్వానం పలికారు. ఈ ఆస్పత్రిలో 230 మంది వైద్యులు, 330 మంది నర్సులు, 5 మంది ప్రాథమిక ఫార్మసిస్ట్‌లు, 13 మంది ఫార్మసిస్ట్‌లు, 13 మంది ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, 13 మంది రేడియేషన్ టెక్నీషియన్లు, 5 మెడికల్ రికార్డు సిబ్బంది సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, స్వామినాథన్, ఎం. సుబ్రమణియన్ , ఎంపీ రాజా, హిందూ గ్రూప్ అధ్యక్షులు ఎన్. రామ్, నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీభవ్య తదితరులు పాల్గొన్నారు.
నీలగిరులకు ఆరు ప్రాజెక్టులు..
అనంతరం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ. 727 కోట్లతో పూర్తి చేసిన 1703 ప్రాజెక్టులను సీఎం స్టాలిన్ ప్రారంభించారు.56 కొత్త ప్రాజెక్టుల పనులకు శంకు స్థాపన చేశారు. 15,634 మంది లబ్ధిదారులకు రూ. 102 కోట్లు విలువైన సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. అలాగే కొత్తగా ఆరు ప్రాజెక్టులను సీఎం ప్రకటించారు. ఇందులో నీలగిరులలోని పేదలకు కూడలూరులో రూ. 26 కోట్లతో 300 గృహాలను నిర్మించి కొత్తగా కలైంజ్ఞర్ నగర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అటవీ గ్రామాల ప్రజల జీవనాధారం పెంపే లక్ష్యంగా ఇక్కడి పరిస్థితులు, వీరి కళాత్మకం, వృత్తి, తదితర అంశాలతో డాక్యుమెంటరీ రూపకల్పనతో పాటూ పరిశోధనకు రూ. 10 కోట్లు ప్రకటించారు. తద్వారా ఎగ్జిభిషన్, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. నీలగిరుల అందాలను వీక్షించేందుకు వీలుగా పర్యాటకుల కోసం హ్యాపి..అండ్ హ్యాపి..హ్యాపి నినాదంతో రూ. 5 కోట్లతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఊటిలో ట్రాఫిక్‌రద్దీని క్రమబద్దీకరించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. గిరిజన ప్రాంతాలలో రూ. 5 కోట్లతో 23 కమ్యూనిటీ హాల్‌స, పట్టణాలలోని గిరిజనుల కోసం రూ. 10 కోట్లతో 200 గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు.
ఆ ధైర్యం ఉందా..?
సంక్షేమ పథకాల పంపిణీ సభలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, నీలగిరులు, ఊటీ ప్రగతి గురించి వివరించారు. తేయాకు తోటలలోని కార్మికు సంక్షేమం, అటవీ గ్రామాల ప్రజలకు జీవనోపాధి గురించి ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానం, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో కేంద్రం తీరును ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ప్రధానిని కలిసేందుకు అనుమతి కోరి ఉన్నామని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం పర్యటన గురించి పేర్కొంటూ, ఇక్కడికి తాను రావాల్సి ఉండటంతో అక్కడికి వెళ్లలేదన్నారు. తమిళనాడు ప్రజల నెలకొన్న ఆందోళనలను తొలగించే విధంగా ప్రధాని ప్రకటన చేస్తారని ఎదురు చూసినట్టు వ్యాఖ్యానించారు. వక్ఫ్ చట్ట సవరణ ప్రజాస్వామ విరుద్ధంగా జరిగిందన్నారు. అయితే, ఈ వ్యవహారాలలో అన్నాడీఎంకే తీరును ప్రస్తావిస్తూ, ఈ బిల్లు పై సుప్రీంకోర్టులో డీఎంకే న్యాయ పోరాటంచేస్తుందన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదం పొందిన నీట్ మినహాయింపు ముసాయిదాను కేంద్రంపాలకులు వెనక్కి పంపించారని పేర్కొంటూ, ఇది విచారకరంగా పేర్కొన్నారు. నీట్ విషయంలో, ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిని ఈసందర్భంగా తాను ప్రశ్నిస్తున్నానని,సవాల్ విసురుతున్నానంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన రూపంలోనే నీట్ అన్నది తమిళనాడులోకి ప్రవేశించినట్టు గుర్తుచేస్తూ, బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు నిజంగా తమిళనాడు విద్యార్థులపై చిత్త శుద్ది అన్నది ఉంటే ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పిస్తేనే పొత్తు అని బీజేపీ అధిష్టానం వద్ద ధైర్యంగా చెప్పగలరా? అని ప్ర శ్నిస్తూ సవాల్ విసిరారు. నీట్ మినహాయింపు ఇస్తేనే పొత్తు అది స్పష్టం చేయగలరా? ఈ ప్రకటనకు సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలను సంధించారు. ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా తమిళనాడును తాకలేరని, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తమిళనాడును ఓడి పోనివ్వడని, ఈ పోరాటంలో గెలుపు తమిళనాడుదే అని ధీమా వ్యక్తం చేశారు.
‘నీట్’ మినహాయిస్తేనే పొత్తు


