హత్య కేసులో ముగ్గురిపై గూండా చట్టం
తిరువళ్లూరు: మాజీ సైనికుడిని హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించిన వ్యవహారంలో ముగ్గురు యువకులపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని ముత్తుకొండాపురం గ్రామానికి చెందిన వెంకటేశన్(45). ఇతను మిలటరీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఇతను గత ఫిబ్రవరి మూడున ద్విచక్రవాహనంలో తన సొంత గ్రామం నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న సమయంలో కారు ఢీకొని ప్రమాదంలో మృతిచెందినట్టు తిరువేళాంగాడు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు వెంకటేషన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి వైద్యశాలకు తరలించారు. అయితే వెంకటేషన్ మృతిపై అనుమానం వుండడంతో పోలీసులు ఆదిశగా విచారణ చేశారు. విచారణలో వెంకటేషన్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు మృతుడి భార్య సంధ్య(33), తోమూరు గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు లోకనాథన్(45) లను అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో సంధ్య, లోకనాథన్‌ల వివాహేతర సంబంధానికి సంబందానికి వెంకటేషన్ అడ్డుగా వున్నాడన్న నెపంతోనే హత్య చేయించినట్టు నిర్ధారించారు. అనంతరం హత్య కేసులో సంబంధం వున్న సంధ్య తమ్ముడు షణ్ముగం(30), తిరువేళాంగాడుకు చెందిన సతీష్(30), చైన్నెకు చెందిన యోగేశ్వరన్(22), శ్రీరామ్(24) సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరు పుళల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా వున్నారు. ఈ క్రమంలో మాజీ సైనికుడిని హత్య చేసిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సతీష్, యోగేశ్వరన్, శ్రీరామ్‌లపై ఇప్పటికే వేర్వేరు పోలీసు స్టేషన్‌ల పరిధిలో హత్య కేసు వున్నట్టు నిర్ధారించిన ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ ముగ్గురిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. నిందితుల చరిత్రను పరిశీలించిన కలెక్టర్ ముగ్గురు నిందితులపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.


