అన్నానగర్: పుదుచ్చేరి నుంచి బుధవారం ఉదయం చైన్నె కోయంబేడుకు ప్రభుత్వ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు బయలుదేరింది. మరమ్మతుకు గురైన బస్సులో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం డ్రైవర్ త్యాగరాజన్ కోయంబేడు వర్క్‌షాప్‌నకు మధ్యాహం నడుపుతూ వెళ్లాడు. బస్సులో ప్రయాణికులు లేరు. కండక్టర్ మనోహరన్ మాత్రమే ఉన్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో కూవతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బస్సు వెళ్తుండగా బస్సు ముందు వైపు నుంచి పొగలు వచ్చాయి. త్యాగరాజన్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ కిందకు దిగారు. ఆపై మంటలు ఇంజిన్ నుంచి నల్లటి పొగతో వేగంగా వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫోర్స్ సిబ్బంది, సెయ్యూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది అరగంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై కూవటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఓ ప్రభుత్వ బస్సులో మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.