వేలూరు: జిల్లాలోని రౌడీలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని నార్త్‌జోన్ ఐజీ అస్రో కార్క్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాణిపేట, కాట్పాడి, పోలీస్‌స్టేషన్‌లను తనఖీ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసు ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులను వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం వేలూరు ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా వచ్చే కేసులను వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. తరచూ పలు నేరాలకు పాల్పడుతున్న నిందితులను గూండా చట్టంతో పాటు కఠినమైన శిక్షలు విధించే విధంగా కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్పీలు, డీఎస్పీలు తరచూ జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు జరిపి పెండింగ్ కేసులపై ఆరా తీయాలన్నారు. వేలూరు జిల్లా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వల్ల మత్తు పదార్థా లు, గుట్కా వంటి వస్తువులు జిల్లాకు తరలించకుండా సరిహద్దు చెక్‌పోస్టులో బందోబస్తును పెంచాలన్నారు. అనంతరం వివిధ కేసులపై ఆరా తీశారు. వేలూరు డీఐజీ దేవరాణి, ఎస్పీ మదివాణన్, అదనపు ఎస్పీలు భాస్కరన్, అన్నాదురై, డీఎస్పీలు పాల్గొన్నారు.