తిరువళ్లూరు: తమిళనాడుకు త్రిభాషా విధానం వద్దని ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ వైరముత్తు అన్నారు. తిరువళ్లూరులో 11 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన సోమవారం రాత్రి ముగిసింది. మొత్తం 11 రోజుల పాటు జరిగిన ఎగ్జిబిషన్‌లో 115 స్టాల్స్, 50 వేల రచయితలకు చెందిన పుస్తకాలను విక్రయాలకు వుంచారు. కాగా 11 రోజలు పాటు జరిగిన ఎగ్జిబిషన్‌లో రూ.52 లక్షలు విలువ చేసే పుస్తకాల విక్రయం జరిగింది. ఇది ఇలా వుండగా చివరి రోజు సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వైరముత్తు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో త్రిభాషా విధానం అమల్లోకి రావడం వల్ల మాతృభాష దెబ్బతినే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలో హిందీ మాత్రమే వుందని అయితే తమిళనాడులో తమిళంతో పాటు ఇంగ్లిషు చదువుతున్నారని వివరించారు. రాజకీయ లబ్ధికోసమే మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఎదుగుదల కోసం తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ ప్రతాప్, డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.