సాక్షి,చైన్నె: చైన్నె వైఎంసీఏ మైదానం వేదికగా కేవైఎన్( నో యువర్ నైబర్ హుడ్) నేతృత్వంలో లైవ్ సంగీత విభావరికి ఏర్పాట్లు చేశారు. ఈనెల 29వ తేదీన అతి పెద్ద ఫ్యూజన్ కాన్సర్ట్‌తో ఈ కార్యక్రమం జరగనుంది. చైన్నెలోని ఫీనిక్స్ మార్కెట్‌సిటీలో మంగళవారం ఈ వివరాలను గాయని, సినీ నటి ఆండ్రియా జెరెమియా, కేవైఎన్ వ్యవస్థాపకురాలు గాయత్రి త్యాగరాజన్ ప్రకటించారు. కేవైఎన్ అనేది స్థానికులకు వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో అనే విషయాలను– వార్తలు, ఈవెంట్‌లు, షాపింగ్, ఒప్పందాలు, కమ్యూనిటీల ద్వారా దరి చేర్చే వేదికగా పేర్కొన్నారు. ఈనెల 29న జరగనున్న సంగీత విభావరి తమ ఉత్సాహాన్ని పంచుకోవడానికి, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి కళాకారులు సమయం కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్లేబ్యాక్ సింగర్ ఆండ్రియా మాట్లాడుతూ ఫ్యూజన్ కచేరీ అనేది ఒక కొత్త , ఉత్తేజకరమైన కాన్సెప్ట్ అని ఆమె వివరించారు. ఇది లైవ్ షోలో మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు. చైన్నెలో అతిపెద్ద ఫ్యూజన్ కచేరీ ఈనెల 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి నందనంలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో జరుగుతుందన్నారు.