తమిళసినిమా: ప్రతిభ ఎక్కడ ఉన్నా సినిమా గుర్తిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. అలా చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటున్న యువ సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్. సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఈయన 9 ఏళ్ల వయసులోనే కీబోర్డుతో సరాగాలు పలికించడం ప్రారంభించారు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ ప్రారంభించిన కేఎస్.కన్ట్‌ర్‌వెట్టరీ సంగీత పాఠశాలలో సౌండ్ ఇంజనీర్‌గా శిక్షణ పొందారు. దీంతో పలు చిత్రాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసిన జోహన్ శివనేశ్‌కు దివంగత ప్రఖ్యాత గాయకుడు ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యం నుంచి ఇళయరాజా వరకూ పలువురు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అలా 2008లో ఇళయరాజా నిర్వహించిన రాజా వన్‌మేన్ షో కచ్చేరిలో కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేశారు. కాగా 2012లో కొల్‌లైక్కారన్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత మెట్రో చిత్రానికి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆళ్, ఉరు, అగడు, ఆయిరం పొర్కాసుగళ్, వైట్ రోస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఈయన కబడ్డీ అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. అలా తన పేరును దక్షిణాదిలో విస్తరించుకుంటున్న జోహన్ శివనేశ్ తాజాగా ఇటీవల తెరపైకి వచ్చిన రాబర్ చిత్రానికి అందించిన సంగీతం ప్రశంసలు అందకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. దీంతో సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఈయన పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు.
సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్