
ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ
●టీఎన్‌సీసీ నిర్ణయం
●నేతలతో ఇన్‌చార్జ్‌ల సమాలోచన
సాక్షి, చైన్నె: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆదివారం టీఎన్‌సీసీ నేతలతో సమావేశంలో ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చైన్నెలో సత్యమూర్తి భవన్ రాష్ట్ర కార్యాలయంగా ఉంది. అలాగే తేనాంపేటలో కామరాజర్ అరంగం ఉంది. 200 గ్రౌండ్లస్థలంతో ఆడిటోరియం ఉంది. ఇక చైన్నె నగరంలో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటూ రాష్ట్రంలో రూ. 500 కోట్లు విలువైన ఆస్తులు పలు జిల్లాలో ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. కామరాజర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్‌కు అప్పట్లో విరాళాలు అధికంగా వచ్చేవి. పార్టీ కార్యాలయాల కోసం భవనాలు, ఖర్చుల కోసం పంట పొలాలను, అందులో సాగుబడి అయ్యే ఉత్పత్తులను విరాళంగా ఇచ్చేన వారు ఎక్కువే. అయితే ఇందులో అనేకం అన్యాక్రాంతమై ఉన్నాయి. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకుని, పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. అనేక ఆస్తులను పార్టీ వారే స్వాహా చేసి చేతులు మార్చినట్టుగా ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులైన గిరిశీ చడన్కర్, ఏఐసీసీ కార్యదర్శి సూరజ్ ఎంఎన్ హెగ్డేలు ఆదివారం చైన్నెలోని సత్యమూర్తి భవన్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆస్తుల మీద చర్చ జరిగింది. ఉన్నవాటిని పరిక్షించుకోవడం, అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టే విధంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఆస్తుల పరిరక్షణకు గతంలో నియమించిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, మాజీ అధ్యక్షులు తంగబాలు, తిరునావుక్కరసర్ వంటి నేతలతో పాటూ రాష్ట్ర కమిటీ, జిల్లాలో ముఖ్యులైన నేతలు పాల్గొన్నారు. అదే సమయంలో ఏఐసీసీ పెద్దలను చైన్నె కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిశారు. వారికి తమ తరపున వినతి పత్రం సమర్పించారు. చైన్నె జిల్లా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మహిళలకు పెద్ద పీట వేయాలని కోరారు. ప్రస్తుత అధ్యక్షుడు మహిళలకు విలువనివ్వడం లేదని, కార్పొరేటర్లను ఏ ఒక్క సమావేశానికి పిలవడం లేదని ఆరోపించారు.