తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటుంటారు. శుభముహూర్తం రోజులు, పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో మూడు నుంచి ఐదు గంటల పాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకోవాల్సి వుండేది. అయితే వేసవి ఎండలతో పాటు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న క్రమంలో భక్తులు రాక తగ్గింది. కొండ ఆలయంలో ఆదివారం సెలవు రోజున కూడా రద్దీ తక్కువగా వుంది. దీంతో ఉచిత దర్శనం క్యూలు ఖాళీగా కనిపించాయి. గంట వ్యవధిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడంతో ఆనందం చెందారు. భక్తుల సౌకర్యార్థం ఎండల నేపథ్యంలో మాడ వీధిలో మ్యాట్ ఏర్పాటు చేసి మంచినీటిని చల్లి చల్లగా వుంచారు. మాడ వీధిలో నడిచి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురికాకుండా స్వామి దర్శనానికి వెళ్లేలా ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు.
రచయిత నారుంపూనాథన్ మృతి
సేలం: ప్రముఖ రచయిత నారుంపూనాథన్ ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మృతిచెందారు. తూత్తుకుడి జిల్లా కళుగుమలైకు చెందిన ప్రముఖ రచయిత నారుంపూనాథన్ (64). ఈయన బ్యాంకులో పని చేశారు. ఈయనకు భార్య శివగామ సుందరి, ఒక కుమారుడు ఉన్నారు. శివగామ సుందరి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దీపక్ విదేశాల్లో ఉంటున్నారు. నెల్‌లై చంద్రనగర్‌లో నివసిస్తున్న నారుంపూనాథన్ కలైంజర్ సంఘం నిర్వాహకునిగా కూడా పనిచేశారు. ఈ స్థితిలో నారుంపూనాథన్ ఆదివారం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడింది. వెంటనే ఆయన్ను నెల్‌లై వన్నారపేటలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే నారుంపూనాథన్ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చంద్రనాగర్‌లో ఉన్న ఇంట్లో ఉంచారు. ఆయన భాతికకాయానికి రచయితలు పలువురు అంజలి ఘటించారు. పలు గ్రంథాలు, పుస్తకాలను రచించిన నారుంపూనాథన్ తమిళ సాహిత్యం, తమిళ భాషాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఈయనకు రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఉ.వె.స్ అవార్డును అందజేసింది. కాగా నారుంపూనాథన్ మృతికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, పలువురు రచయితలు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు.
కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మృతి
తిరువొత్తియూరు: తేనె కోసం కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్‌షాక్‌కు గురై ఓ ఎలుగుబంటి మృతిచెందింది. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని నాన్‌సాచ్ ప్రాంతంలో తేయాకు తోట ఉంది. ఈ తోటలోని విద్యుత్ స్తంభంపై తేనెతుట్టె ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ఎలుగుబంటి పిల్లలతో టీ తోటలోకి వచ్చింది. తేనెతుట్టె ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఎలుగుబంటి ఎక్కుంది. అప్పుడు హఠాత్తుగా ఎలుగుబంటి కరెంట్‌షాక్‌కు గురై కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలిసి స్థానికులు కున్నూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఎలుగుబంటి కళేబరాన్ని పరిశీలించారు అనంతరం పశువైద్యుడిని పిలిపించి ఎలుగుబంటికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
బైక్ అదుపుతప్పి
కార్మికుడు దుర్మరణం
తిరువళ్లూరు: నిత్యావసర వస్తువులు కొనడానికి వెళ్లిన ఒడిశా కార్మికుడు బైక్ అదుపుతప్పి కిందపడడంతో దుర్మరణం చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిబాడాకు(33). ఇతను భార్య ఫాతిమాడాకు(28)తో కలిసి ఇటీవల వలస వచ్చారు. ఇద్దరు కలిసి తిరువళ్లూరు జిల్లా విశ్వనాథపురంలో నివాసం వుంటూ స్థానికంగా వున్న ఫేనా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి విశ్వనాథపురం నుంచి మప్పేడుకు ద్విచక్ర వాహనంలో వెళ్లిన సీబాడాకు అక్కడ నిత్యావసర వస్తువులను కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాడు. మప్పేడు సమీపంలో వెళుతుండగా ఎదురుగా పశువులు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. గాయపడ్డ ఇతన్ని 108 వాహనంలో తరలిస్తుండగా మృతిచెందాడు. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుత్తణిలో సాధారణ రద్దీ