తమిళసినిమా: యువ నటుడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరెండర్. ఈయన తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ఇది అన్నది గమనార్హం. ఇందులో నటుడు లాల్, సుజిత్ శంకర్, మునీష్ కాంత్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆఫ్ బీట్ ఫిలిమ్స్ పతాకంపై విక్రం కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ సరెండర్ చిత్రం యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా తమిళ సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కాగా చిత్రం టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు విజయ్ సేతుపతి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా సరెండర్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి మెయ్యేంద్రన్ ఛాయాగ్రహణం అందించగా, వికాశ్ ప్రదీషా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితర ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశారన్నది గమనార్హం.