● డిప్యూటీ సీఎం ఉదయనిధి ● 50 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ ● బడులకు గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్లు
సాక్షి, చైన్నె: తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు తరపున పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పూర్తిగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆదేశించారు. 50 ఎలక్ట్రిక్ ఆటోలను మహిళలకు పంపిణీ చేశారు. బడులకు గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు, వాతావరణ మార్పు శాఖ తరపున మహిళా స్వయం సహాయక సంఘాలకు 50 విద్యుత్ ఆటోల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ ఆటోలకు డిప్యూటీ సీఎం ఉదయనిధి జెండా ఊపారు. అలాగే పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్ వేదిక ద్వారా పర్యావరణ పరిరక్షణకు పరిష్కారాలను అందించనున్నారు. కొత్త పారిశ్రామిక కంపెనీలను నమోదుకు దోహదకరం కానుంది. అలాగే తమిళనాడు మార్కెట్ అవకాశాలను సృష్టించుకోవడానికి నూతన ఆవిష్కరణల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాజెక్ట్‌గా ఈ వెబ్ సైట్ ఉంటుందని ప్రకటించారు. తమిళనాడు తీరంలో జీవనాడి, సంప్రదాయ స్థితి స్థాపకతలు, స్వదేశీ స్థిర ఆవాసాలు– వాతావరణ మార్పు, ఉత్తమ పద్దతుల పేరిట మూడు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పచ్చదనంతో కూడన వాతావరణం కల్పించిన దిండిగల్ జిల్లా పంచంపట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్,కరూర్ జిల్లా పూగలూరులోని ప్రభుత్వ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుచ్చి జిల్లా కాంచనాయకన్‌పట్టి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరిస్తూ, వారికి హరిత పాఠశాలలకు గాను సర్టిఫికెట్లను అందజేశారు.
ఎలక్ట్రిక్ ఆటోలు..
రోజువారీ జీవితంలో వాతావరణాన్ని కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ ఉత్పత్తులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం వంటి అంశాలపై అవగాహన ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటులతో సిద్ధం చేసి, ఎలక్ట్రిక్ ఆటోలను అందజేసి, అందులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ తమిళనాడును పర్వావరణ ముప్పు నుంచి పరిరక్షించే విధంగా వివిధ కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అవగాహన కల్పించాలని, తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు తరపున పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ను పూర్తిగా అమలు చేయాలని ఆదేశించారు. 50 ఎలక్ట్రిక్ ఆటలలో ఒకొక్కటి ధర రూ. 4.83 లక్షలుగా పేర్కొంటూ, ఈ ఆటోలు మహిళా స్వయం సహాయక బృందాలకు స్నాక్స్, రీసైకిల్ చేసిన ఉత్పుత్తులు, పర్యావరణ అనుకూల వస్తువలు అమ్మకాలు, తదితర వాటికి సైతం ఉపయోగకరంగా ఉంటే రీతిలో ఏర్పాటు జరిగినట్టు వివరించారు. , ఈ ఎలక్ట్రిక్ ఆటోలపై అవగాహన ప్రచారంలో అత్యాధునిక మైక్రోఫోన్ యాంప్లిఫైయర్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పసుపు రంగు బ్యాగ్, బయోడిగ్రేడబుల్ టంబ్లర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, చెక్క స్పూన్లు . రీసైకిల్ చేసిన కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన గ్లాస్, ప్లేట్లు ఈ ఆటోల ద్వారా ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పర్యావరణ , అటవీ శాఖ అదనపు ప్రధానకార్యదర్శి సుప్రియ సాహూ, పంచాయతీ రాజ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ భేడీ, ట్రాన్స్‌ఫర్మేషన్ డైరెక్టర్ ఎ.ఆర్. రకుల్‌నాథ్, తమిళనాడు మహిళ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రేయ పి సింగ్, కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ డాక్టర్ ఎం. జయంతి, చైర్మన్, తమిళనాడు వాతావరణ మార్పు ఉద్యమం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వివేక్‌కుమార్, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిసభ్యకార్యదర్వి ఆర్. కన్నన్ తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.