సేలం : నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ లోని ప్రసిద్ధ చిన్న ఓంకాళియమ్మన్ ఆలయంలో, మాసి అగ్ని గుండ మహోత్సవం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40,000 మందికి పైగా భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్‌లోని ప్రసిద్ధ చిన్న ఓంకాళియమ్మన్ ఆలయంలో మాసి అగ్నిగుండ ఉత్సవం గత నెల 28న పూల సమర్పణతో ప్రారంభమైంది. పుష్పాల సమర్పణ తర్వాత, దేవతను ఆవాహన చేయడం, శక్తి కరగం తీయడం, అగ్ని కరగం, శూలాలు గుచ్చడం, దీప పూజ, 108 శంఖాభిషేకం, పుష్పాలంకరణ వంటి వివిధ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య ఘట్టమైన మాసి అగ్ని గుండ మహోత్సవం సందర్భంగా ఆలయం ముందు 60 అడుగుల పొడవైన అగ్ని గుండంను మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. బుధవారం వేకువజామున 4.30 గంటలకు మాలధారణ భక్తులు గంగ స్నానం ఆచరించారు. అనంతరం పూజారి, అతని కుటుంబం ముందుగా అగ్ని గుండ ప్రవేశం చేశారు. తరువాత పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు సహా 40 వేల మంది భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు తీర్చుకున్నారు.
అగ్నిగుండ ప్రవేశం చేసిన 40 వేల మంది భక్తులు
ఘనంగా అగ్ని గుండ మహోత్సవం