తిరువళ్లూరు: విద్యార్థులు బట్టీ పట్టి పరీక్షలు రాస్తే మార్కులు పెరుగుతాయే తప్ప భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరులో పుస్తక ప్రదర్శన పది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బట్టీ విధానం వల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించారు. ఇరయన్బు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాక్టికల్ విధానం వల్లే ప్రయోజనం కలుగుతుందన్నారు. చాలా మంది విద్యార్థులు, విద్యాసంస్థలు మార్కుల కోసం బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పరీక్షకు ముందు రోజు వరకు పుస్తకాలతో కుస్తీ పడొద్దన్న ఆయన, పరీక్షలంటే భయం వద్దన్నారు. అనంతరం ప్రాక్టికల్ విధానం పట్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు.