నటుడు సిద్ధార్థ్ 40వ చిత్రం ‘3 బీహెచ్‌కే’
తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్ బహుభాషా కథానాయకుడు, నిర్మాత అన్నది తెలిసిందే. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన మిస్ యూ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా తాజాగా నటిస్తున్న చిత్రాన్ని శ్రీ గణేష్ కథ , దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు 8 తోట్టాగళ్, కురుది ఆటం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా నటుడు శరత్ కుమార్, నటి దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మీత రఘునాథ్ , చైత్రా కథానాయికలుగా నటిస్తున్నారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమృత్‌నాథ్ సంగీతాన్ని, దినేష్ కృష్ణన్, జితిన్ స్టానిస్లస్ ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా 3 బీహెచ్‌కే నటుడు సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రం కావడం గమనార్హం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ను, టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు గురువారం విడుదల చేశారు. అందులో ఇది మన అందరి కథలా ఉంటుందని ఆశిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. ఇది త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్‌ను కొనుక్కోవాలని ఆశపడే ఓ కుటుంబం నేపథ్యంలో సాగే కథ చిత్రం అని సమాచారం. దీంతో నటుడు సిద్ధార్థ్ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథా చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


