బంగారు రథానికి దుర్గా స్టాలిన్ పూజలు
ఏకాంబరనాధర్ ఆలయం సందర్శన
సాక్షి, చైన్నె : కాంచీపురం ఏకాంబరనాధర్ ఆలయాన్ని సీఎం స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ శనివారం సందర్శించారు. ఇక్కడ కొత్తగా రూపుదిద్దుకున్న బంగారు రథానికి పూజలు చేశారు. రథాన్ని లాగి ప్రారంభించారు. కాంచీపురంలోని ఏకాంబరనాధర్ ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఆలయ వర్గాలు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఇక్కడ ప్రత్యేక పూజలు ఆమె చేశారు. ఆమెకు ఆలయ ఏనుగుతో ఆశీర్వచనాలు అందించారు. అలాగే, ఆలయంలో కొత్తగా సిద్ధం చేసిన బంగారు రథాన్ని పరిశీలించారు. ఈరథానికి ఆమె పూజలు చేశారు. రథాన్ని లాగి ప్రారంభించారు.
దాడిలో ప్లస్‌టూ విద్యార్థి మృతి
సాక్షి,చైన్నె : పాఠశాల విద్యార్థుల మధ్య వివాదం ప్లస్‌టూ విద్యార్థిని బలిగొంది. ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థిపై ప్లస్‌ఒన్ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, చివరకు హత్య కేసులో కటకటాలపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో పట్టేశ్వరం అన్నా ప్రభుత్వ మోడల్ స్కూల్ ఉంది. ఇక్కడ ప్లస్‌టూ చదువుతున్న కవియరసన్ అనే విద్యార్థిపై బుధవారం ప్లస్‌ఒన్ విద్యార్థులు 15 మంది దాడి చేశారు. విద్యార్థుల మధ్య రేగిన శతృత్వం ఈ దాడికి కారణంగా మారింది. తీవ్రంగా గాయపడ్డ కవియరసన్‌ను ముందుగా కుంబభకోణం ఆస్పత్రికి, ఆ తర్వాత తంజావూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన కవియరసన్ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పాఠశాలలో చోటుచేసుకున్న వివాదం అస్త్రంగా చేసుకుని 15 మంది ప్లస్‌ఒన్ విద్యార్థులు ఇంటికి వెళ్తున్న కవియరసన్‌పై అతి దారుణంగా దాడి చేసిన వీడియో వెలుగులోకి రావడం వైరల్‌గా మారింది. కవియరసన్‌ను కొట్టి చంపిన15 మంది విద్యార్థులపై హత్య కేసు నమోదైంది. వీరిని కుంబకోణం పోలీసులు అరెస్టు చేశారు.
12 కిలోల గంజాయి స్వాధీనం
తిరువళ్లూరు: ఆంధ్రా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, ఆవడి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా వుంచి వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే శనివారం రెడ్‌హిల్స్‌లో పోలీసులు వాహన తనిఖీల్లో నిర్వహిస్తున్నారు. ఆసమయంలో బైక్‌లో వచ్చిన ఇద్దరి వద్ద తనిఖీ చేశారు. వారి వద్ద 12కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు ప్రబిర నారాయణ హల్దార్(38), ధీపక్ ప్రభు(29)గా గుర్తించారు. వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి రెడ్‌హిల్స్‌లో విక్రయించడానికి యత్నించినట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
వంద లీటర్ల డీజిల్ చోరీ
తిరువళ్లూరు: జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సెల్‌ఫోన్ టవర్ నుంచి వంద లీటర్లు డీజిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటనపై పోలీసులకు పిర్యాదు అందింది. తిరువళ్లూరు జిల్లా కరికళవాక్కం, పాగల్‌మేడు రెండు ప్రాంతాల్లో సెల్ టవర్లు ఉన్నాయి. సంబంధిత సెల్ టవర్ వద్ద వున్న జనరేటర్‌లో వంద లీటర్ల డీజిల్ చోరీ జరిగింది. చోరీపై సెక్యూరిటీ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన సంస్థ మేనేజర్ సుధాకర్ వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేర్పాటువాద శక్తులను అణచివేస్తాం
కొరుక్కుపేట: రాష్ట్రంలో వేర్పాటువాద శక్తులను ఉక్కు పిడికిలితో అణచివేస్తామని రాష్ట్ర హిందూ ధర్మాదాయశాఖా మంత్రి పి.కె. శేఖర్‌బాబు అన్నారు. రామేశ్వరం–కాశీ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనే సీనియర్ సిటిజన్ల కోసం రైల్వే ప్రయాణాన్ని మంత్రి శేఖర్‌బాబు స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రామేశ్వరం–కాశీ ప్రాజెక్టు ఆధ్యాత్మిక భక్తుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం 60–70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చామని అన్నారు.


