గెలుపే కరుణకు కానుక | - | Sakshi
Sakshi News home page

గెలుపే కరుణకు కానుక

May 27 2024 6:20 PM | Updated on May 27 2024 6:20 PM

గెలుప

గెలుపే కరుణకు కానుక

జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపుతో గెలుపును దివంగత డీఎంకే దిగ్గజం కరుణానిధికి కానుకగా సమర్పిద్దామని డీఎంకే శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. కలైంజ్ఞర్‌ శత జయంతి ఉత్సవాల ను ఘనంగా ముగిద్దామని సూచించారు. డీఎంకే కూటమితో నవ భారతం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.

సాక్షి, చైన్నె: డీఎంకే దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా రాష్ట్రంలో అధికారిక వేడుకగా (ప్రభుత్వ నేతృత్వంలోనూ), పార్టీ నేతృత్వంలోనూ ఘనంగా నిర్వహిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 3వ తేదీ కరుణానిధి జయంతి కావడంతో శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకను రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకుందామని పిలుపు నిస్తూ పార్టీ వర్గాలకు ఆదివారం స్టాలిన్‌ లేఖ రాశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త జీవితాలతో దివంగత నాయకుడు కరుణానిధి ముడిపడి ఉన్నారని, ఆయన తోబుట్టువులైన కేడర్‌కు ముగింపు వేడుకల జయప్రదానికి పిలుపు నిస్తూ ఈ లేఖ రాస్తున్నట్టు స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త హృదయంలో, రక్తం , నర నరాలలో కరుణానిధి జీవించి ఉన్నారని గుర్తు చేశారు. డీఎంకేతో రాజకీయ విప్లవాన్ని సృష్టించి తమిళనాడు రాజకీయ చరిత్రలోనే కాదు, భారతీయ రాజకీయ చరిత్రలోనూ రాజకీయ పండితుడు కలైంజ్ఞర్‌ కరుణానిధి పేరు గడించారని పేర్కొన్నారు. అవిశ్రాంత నేతగా, ఓటమి ఎరుగని యోధుడిగా తమిళాభ్యున్నతి కోసం శ్రమించిన మహానేతకు ఘన నివాళులర్పిద్దామని పిలుపు నిచ్చారు. పెరియార్‌, అన్నదురై అడుగు జాడలలో బాల్యం నుంచే శ్రమించి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నవ తమిళనాడుకు పునాదులు వేసి వెళ్లిన మహానేత కరుణానిధి అని కొనియాడారు. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి ఎవరో అన్నది నిర్ణయించే స్థాయికి తమిళ ఖ్యాతిని చాటే విధంగా తీసుకెళ్లిన ఘనత కరుణానిధికే దక్కుతుందన్నారు.

గెలుపు తథ్యం..

కలైంజ్ఞర్‌ మార్గదర్శకత్వంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. ఆయన పడ్డ శ్రమకు మరో గుర్తింపుగా రాష్ట్రంలో విజయవంతంగా తన నేతృత్వంలో డీఎంకే ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. 2023 జూన్‌ 3న కరుణానిధి శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టామని పేర్కొంటూ, గత ఏడాది సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రజా హితమే లక్ష్యంగా ప్రాజెక్టులను అమలు చేయడమే కాకుండా , కరుణ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడువున విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఆయన శత జయంతి స్మారకంగా ప్రజల కోసం గిండి, మదురైలో భారీ ఆస్పత్రి, గ్రంథాలయాన్ని ప్రజలకు అంకితం చేశామని, కిలాంబాక్కంలో సబర్బన్‌ బస్‌ టెర్మిన్‌ ద్వారా ప్రయాణికులకు విస్తృతం సేవలు అందిస్తున్నామని తెలిపారు. మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉన్న దివంగత నేతకు బ్రహ్మాండ స్మారకం రూపొందించామని, ఆయన జన్మించిన ప్రదేశం తిరువారూర్‌ తిరుక్కువళైలలోనూ స్మారకం పూర్తి చేశామని గుర్తు చేశారు. కరుణ చూపిన మార్గంలో చెప్పిందే కాదు.. చెప్పని వాగ్దానాలను కూడా అమలు చేస్తూ వస్తున్న ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుందని అన్నారు. శ్రీద్రవిడ మాడల్‌ శ్రీ ప్రభుత్వ గత ఏడాది సాధించిన విజయాలను రోజూ ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

సామాజిక న్యాయం

తమిళనాడులో ప్రజల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నంచేసిన వారికి గుణపాఠం చెప్పే విధంగా సామాజిక న్యాయం నినాదంతో ప్రజలు అందరినీ కలుపుకుని ముందుకెళ్లామని వివరించారు. పార్టీ పరంగా ప్రతి కేడర్‌ పడ్డ శ్రమకు గుర్తింపుగా నియోజకవర్గానికి 50 వేల మంది కొత్త సభ్యులు ఇటీవల కాలంగా చేరినట్టు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతి నాయకుడు, కార్యకర్త పడ్డ శ్రమకు ఫలితం మరి కొద్దిరోజుల్లో దక్కబోతోందన్నారు. జూన్‌3న కలైంజ్ఞర్‌ పుట్టిన రోజు అని, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రజా ప్రయోజనాలను కాంక్షించే విధంగా సేవా కార్యక్రమాలతో శత జయంతి ఉత్సవాలకు ముగింపు పలకాలని పిలుపు నిచ్చారు. వాడవాడలా కరుణానిధి చిత్ర పటాలను కొలువు దీర్చాలని, ప్రజలకు ఉపయోగ పడే విధంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ఆ మరుసటి రోజైన జూన్‌ 4వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. ఈ రోజున సాధించే విజయాన్ని కరుణకు కానుకగా సమర్పిద్దామన్నారు. ఈ విజయంతో డీఎంకే నేతృత్వంలో నవ భారతం నిర్మాణమే లక్ష్యంగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇదే రోజున మతతత్వ శక్తులను తరమి కొట్టడం కూడా ఖాయం అని పేర్కొంటూ ముగించారు.

న్యూస్‌రీల్‌

జూన్‌3న ఘనంగా శత జయంతి వేడుకల ముగింపు డీఎంకే కూటమితో

నవ భారతం తథ్యం

పార్టీ శ్రేణులకు స్టాలిన్‌ లేఖ

గెలుపే కరుణకు కానుక1
1/1

గెలుపే కరుణకు కానుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement