
విజయ్
● జిల్లాల నేతలందరికీ ఆహ్వానం
సాక్షి, చైన్నె : కొత్త పార్టీ ప్రకటన తర్వాత తొలి సమావేశానికి తమిళగ వెట్రిక్ కళగం అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్ నిర్ణయించారు. సోమవారం చైన్నె పయనూర్‌లో జరిగే పార్టీ తొలి సమావేశానికి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలకు ఆదివారం ఆహ్వానం పలికారు. వివరాలు.. సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రిక్ కళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యం అని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఈ దృష్ట్యా, రానున్న ఎన్నికలలో ఆ పార్టీ తరపున అభ్యర్థులు ఎవరూ పోటీలో ఉండరనే విషయం స్పష్టమైంది. ఎన్నికల అనంతరం పార్టీ ఆవిర్భావ మహానాడు, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా రాష్ట్ర స్థాయిలో పర్యటనకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రకటన తదుపరి తొలి సమావేశానికి విజయ్ రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటన ఆదివారం వెలువడింది. సోమవారం ఉదయం పనయూరులోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుషి ఆనంద్ ప్రకటించారు. ఈ సమావేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సభ్యత్వ నమోదులో దూసుకెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టే విధంగా జరిగే ఈ సమావేశానికి పార్టీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలను ప్రకటించనున్నారు.