ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఆరు రోజుల పాటు రైతు వారం కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు రైతులు హాజరై వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఇతర శాఖలు అందించే విలువైన సలహాలు సూచనలు తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 9 వరకు రైతు వారం నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు అవి రైతులకు చేరేలా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖలు రైతువారం కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. వ్యవసాయంలో సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం, ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ఆరు రోజులపాటు కార్యక్రమాలు ఇలా..
ఫ సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి నేల ఆరోగ్య పరిరక్షణ సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అదే విధంగా పౌర సరపరాల శాఖ వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. భూసార పరీక్షల నిర్వహణ కోసం మట్టి నమూనాలను సేకరించనున్నారు.
ఫ మంగళవారం ఉద్యానవన, మత్స్య శాఖతో పాటు మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంపుదల ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు ప్రభుత్వం అందించే సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంటల దిగుబడులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
ఫ బుధవారం బ్యాంకులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. బ్యాంకుల ద్వారా రైతులకు అందించే దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల అవగాహన కల్పిస్తారు.
ఫ గురువారం నియోజకవర్గ స్థాయిలో విద్యుత్, రెడ్‌కో శాఖల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. అందులో వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ, రుణాలపై ప్రభుత్వ సబ్సిడీ వినియోగం లాభాలపై అధికారులు రైతులకు వివరించనున్నారు.
ఫ శుక్రవారం పశు సంవర్థక శాఖ, మత్స్య, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పాడిపరిశ్రమ, పశు జాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణపై గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చెరువులో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, మత్స్య అధికోత్పత్తిపై వివరించానున్నరు.
ఫ శనివారం గ్రామస్థాయిలో రైతులతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మతు, కాల్వలు, చెరువుల్లో కంపచెట్లు, గుర్రపుడెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
ఫ జిల్లాలో నేటి నుంచి రైతులకు
అవగాహన సదస్సులు
ఫ వ్యవసాయ, అనుబంధ శాఖల
ఆధ్వర్యంలో నిర్వహణ
ఫ తొలిరోజు మట్టి నమూనా
ఫలితాల కార్డులు అందజేత


