సూర్యక్షేత్రంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

సూర్యక్షేత్రంలో పూజలు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం మహాసౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్‌, రామకోటి స్థూపాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్‌, గణపురం నరేష్‌, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.

ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

చిలుకూరు : మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ బాసిరెడ్డి లక్ష్మమ్మ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని 9 గురుకుల జూనియర్‌ కళాశాలలు ఉండగా.. ఇందులో 5 బాలుర, 4 బాలికల కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఆయా కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణీత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఐఎన్‌టీయూసీ జిల్లా

జనరల్‌ సెక్రటరీగా వెంకన్న

సూర్యాపేట : ఐఎన్‌టీయూసీ జిల్లా జనరల్‌ సెక్రటరీగా బూర్గుల వెంకన్నను నియమించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంఘం భవన్‌లో ఆదివారం నిర్వహించిన ఐఎన్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆలకుంట్ల బాలృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బంటు చొక్కయ్యగౌడ్‌ వెంకన్నకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

జాబ్‌మేళా విజయవంతం

నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్‌ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభిచాయని తెలిపారు.

ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

అర్వపల్లి : ధ్యానంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూర్యాపేట హార్ట్‌ఫుల్‌ నెస్‌ సంస్థ ఇన్‌చార్జి ఎం. వెంకటరంగారావు అన్నారు. అర్వపల్లిలోని ధ్యాన శిక్షణ కేంద్రంలో ఆదివారం శ్రీరామచంద్రమిషన్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధాన్యంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ కేంద్రంలో ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. చుట్టు పక్కల మండలాల ప్రజలు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యసకులు వనం రమేష్‌, మేకల సత్యనారాయణ, రాగి అనిల్‌, మనుబోతుల వీరయ్య, కేశబోయిన వీరయ్య, ఉమారాణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement