పటిష్ట భద్రత
సూర్యాపేటటౌన్ : నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 887 మంది విద్యార్థులకు 865 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షించి మరీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అధికారులు సైతం ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
865 మంది హాజరు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులకు 164 మంది, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ దురాజ్‌పల్లిలో 240 మందికి 236, తెలంగాణ మోడల్‌స్కూల్ ఇమాంపేటలో 240 మందికి 233, జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల 144 మంది విద్యార్థులకు 141 మంది, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల ఇమాంపేటలో 95 మంది విద్యార్థులకు గాను 91 మంది హాజరయ్యారు. మొత్తం మీద 97.5శాతం హాజరు నమోదైంది.
నీట్ పరీక్ష సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించామన్నారు. పరీక్ష సామగ్రి, పత్రాల తరలింపులో అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ వెంకటయ్య, నిర్వాహణ అధికారులు ఉన్నారు.
ఫ జిల్లాలో ఐదు సెంటర్లలో నిర్వహణ
ఫ 97.5శాతం మంది విద్యార్థులు హాజరు


