లక్ష్మీనరసింహుడికి వసంతసేవ | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహుడికి వసంతసేవ

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం అర్చకులు వసంతసేవ, చక్రతీర్థం, మహాలక్ష్మీహోమం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వైఖానస సంప్రదాయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, ప్రత్యేకఅర్చనలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో వసంతసేవ, చక్రతీర్థస్నానానికి స్వామి, అమ్మవార్లను తరలించారు. ప్రహ్లాద స్నానఘట్టం వద్ద అర్చకులు, ధర్మకర్తలు ప్రభోది మంత్ర పుష్పనీరాజనాలతో రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామికి వసంతసేవ, చక్రతీర్థస్నానం నిర్వహించారు. అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో వసంతసేవ సంబరాలు పూర్తి చేశారు. అనంతరం హోమం మహాపూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం దోపోత్సవం, అశ్వవాహనోత్సవం, ధ్వజారోహనం చేపట్టారు. తిరుకల్యాణోత్సాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి పుష్పయాగం, ద్వాదశ సేవలు, శృంగార డోలోత్సవం, పవళింపుసేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, బజ్జూరు వెంకటరమణ, కాంతారావు, ఈఓ జ్యోతి, సహాయ యాజ్ఞికుడు నారాయణం హరికిరణాచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement