జూన్‌ 5 నుంచి 12 వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 5 నుంచి 12 వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

సూర్యాపేటటౌన్‌ : జూన్‌ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష కోసం మే 14వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని, రూ.50 అపరాధ రుసుంతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. విద్యార్థులు మార్కుల రీకౌంటింగ్‌ కోసం రూ.500 రుసుం చెల్లించాలని కోరారు. రీ వెరిఫికేషన్‌ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించి రీవెరిఫికేషన్‌తో పాటు ఆన్సర్‌ బుక్‌ పొందవచ్చన్నారు. వివరాలకు పాఠశాల హెచ్‌ఎంను సంప్రదించాలని సూచించారు.

తిరు కల్యాణోత్సవాలు ప్రారంభం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మేనెల 4వ తేదీ జరగనున్న శ్రీరాజ్య లక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాలను బుధవారం రాత్రి ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌ ,అర్చకులు ప్రత్యేక పూజలతో వైభవంగా ప్రారంభించారు. ఈనెల 30 అర్ధరాత్రి నుంచి శ్రీస్వామి వారి ఎదుర్కోళ్లతో కల్యాణోత్సవం ప్రారంభమై తెల్లవారు జామున ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఈసందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, మృత్యంగ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం, నవకుంభారోపణము, అగ్ని ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను సహాయ యాజ్ఞీకులు హరికిరణాచార్యులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, రామాచార్యులు, కృష్ణమాచార్యులు , పద్మనాభాచార్యులు బదరీనా రాయణా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, బ్రహ్మచార్యులు ,ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

మట్టి నమూనా ఆధారంగా ఎరువుల వినియోగం

కోదాడరూరల్‌ : రైతులు వ్యవసాయ భూముల్లో మట్టి నమూనా పరీక్షలు చేయించి, వాటి ఆధారంగా ఎరువులను వాడాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ సూచించారు. బుధవారం మండల పరిధిలోని చిమిర్యాల రైతు వేదికలో కేవీకే, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, పంట మార్పిడితో తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, పప్పు దినుసులు, ఉద్యానవన పంటలను సాగు చేసి ఆర్థికంగా బలపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ పాలెం రజిని, సర్పంచ్‌ కొత్త గురవయ్య, ఏఈఓ మహేష్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement