అన్నింటికీ ఆయనే పెద్ద | - | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆయనే పెద్ద

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

కోదాడ : పాలక వర్గాలు మారినా కోదాడ మున్సిపాలిటీలో ఓ మాజీ కౌన్సిలర్‌ భర్త హవా మాత్రం తగ్గడం లేదు. రాజకీయ నాయకుడిగా, కాంట్రాక్టర్‌గా ఉన్న ఆయన మున్సిపాలిటీలో అధికారులు, పాలకులకు దగ్గరి వ్యక్తిగా వ్యవహరిస్తూ అన్ని రకాల పనులను చక్కబెడుతున్నాడు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉంటూ తాజాగా మున్సిపాలిటీలో తాను చెప్పిందే వినాలంటూ హుకుం జారీ చేయడం తాజా మున్సిపల్‌ కౌన్సిలర్లకు మింగుడుపడడం లేదని సమాచారం. కోదాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పాలకవర్గాలతో సన్నిహితంగా ఉంటున్న సదరు నాయకుడికి మున్సిపాలిటీలో పాలన, కాంట్రాక్టులు, అధికారుల పనితీరు, లోటుపాట్లపై పూర్తి అవగాహన ఉండడంతో నూతన పాలకవర్గ పెద్దలు కూడా ఆయనకే అన్ని పనులు అప్పగిస్తుండడంతో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తున్నదని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.

అనుభవమే పెట్టుబడి..

కోదాడ మున్సిపాలిటీ తొలి పాలకవర్గం 2014లో ఏర్పడింది. అప్పటి పాలకవర్గ ముఖ్యులు ఆయన బంధువులు కావడంతో సదరు కాంట్రాక్టర్‌ అధికార, అనధికార కార్యక్రమాలను చక్కబెట్టేవాడు. 2019లో రెండవసారి పాలకవర్గంలో తన సతీమణి కౌన్సిలర్‌ కావడంతో పాటు అప్పటి ఎమ్మెల్యేకు ముఖ్యఅనుచరుడిగా ఉంటూ మున్సిపాలిటీలోనూ హవా చెలాయించాడు. నాడు మున్సిపాలిటీలో కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను ఆయనే చేసేవాడని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం కూడా అధికార పార్టీలోకి మారి పాలకవర్గ పెద్దల చెంతకు చేరి మరోసారి చక్రం తిప్పుతుండడంతో పలువురు కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

కౌన్సిల్‌ తీర్మానాలు లేకుండానే...

మున్సిపాలిటీలో ఏమైనా పనులు చేయాలన్నా కౌన్సిల్‌ తీర్మానం తప్పనిసరి. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి, తీర్మానం చేసి, టెండర్లు పిలవడానికి ఎక్కువ సమయం పడుతుందనే సాకుతో సదరు కాంట్రాక్టర్‌ కోదాడ మున్సిపాలిటీలో లక్షల రూపాయల పనులను తానే సొంతంగా చేయడం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇటీవల కోదాడలోని ఉత్తమ్‌ పద్మావతినగర్‌లో కోదాడ అర్బన్‌ పార్కు పునరుద్ధరణ పనులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. అయితే తీర్మానం చేసేందుకు సమయం పడుతుందనే సాకుతో సదరు మాజీ కౌన్సిలర్‌ భర్త సొంత ఖర్చుతో లక్షల రూపాయల పనులు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనికి అధికారులు అడ్డు చెబితే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నట్లు విమర్శలున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్‌ భర్త వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఫ కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే పనులు

ఫ అధికారులకు బెదిరింపులు

Advertisement
 
Advertisement
Advertisement