గుడిబండ.. మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

గుడిబండ.. మట్టి దందా

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

ప్రభుత్వ భూముల్లో మట్టి తరలిస్తే చర్యలు

కోదాడ : కోదాడ సమీపంలోని గుడిబండ కేంద్రంగా మట్టిదందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూములు, గుట్టలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో తవ్వుతూ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తూ ప్రధాన రహదారి పక్కనే డంపు చేస్తున్నారు. ఆ తర్వాత ట్రాక్టర్ల ద్వారా వెంచర్లకు తరలిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో మట్టి దందాలో చక్రం తిప్పిన వారే తాజాగా పార్టీ మారి ఇదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నా, పచ్చటి గుట్టలను మింగేస్తున్నా రెవెన్యూ అధికారులుగాని, పోలీసులుగాని, మైనింగ్‌శాఖ అధికారులుగాని పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూములే లక్ష్యంగా..

కోదాడ మండలంలోని గుడిబండ, కాపుగల్లు, రెడ్లకుంట, కూచిపూడి, తొగర్రాయి గ్రామాల సమీపంలో గుట్టలు, ఏనెలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి చెందినవి కావడం, వ్యవసాయయోగ్యంగా లేక పోవడంతో కొందరు అక్రమార్కులు వీటిపై కన్నేశారు. భారీ ప్రోక్లెయిన్స్‌తో గుట్టలను పెకిలించి మట్టిని తీస్తున్నారు. పెద్ద ట్రిప్పర్లలో మట్టిని నింపి రాత్రి సమయాల్లో నేరుగా కోదాడలోని వెంచర్లలోకి తరలిస్తున్నారు. మరి కొందరు మట్టిని కోదాడ– మేళ్లచెరువు రోడ్డు పక్కనే డంపు చేసి ఉదయం వేళల్లో ట్రాక్టర్ల ద్వారా కోదాడ పట్టణంలో ఇల్లు కట్టుకునే వారికి, వెంచర్ల నిర్వాహకులకు అమ్ముతూ లక్షల్లో ఆర్జిస్తున్నారు.

హోల్‌సేల్‌గా కొని.. రిటైల్‌గా అమ్మకం...

ప్రస్తుతం కోదాడ పట్టణంలో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దాంతో మట్టికి డిమాండ్‌ ఏర్పడింది. దీనిని అక్రమార్కులు తమకు అనకూలంగా మార్చుకుంటున్నారు. రాత్రి సమయంలో ప్రభుత్వ భూముల నుంచి మట్టిని భారీ టిప్పర్ల సాయంతో మైదాన ప్రాంతానికి తరలించి డంప్‌ చేస్తున్నారు. ఉదయం వేళల్లో మట్టిని ట్రాక్టర్ల ద్వారా రిటైల్‌గా అమ్ముతున్నారు. ఒక ట్రిప్పర్‌ మట్టిని నాలుగైదు వేలకు కొనుగోలు చేసి.. దానిని రిటైల్‌గా రూ.10 వేలకు అమ్ముకుంటున్నారు. కోదాడకు చెందిన ఇద్దరు, కాపుగల్లుకు చెందిన ఒకరు, గుడిబండకు చెందిన ఒకరు ఈ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..

కోదాడ నియోజకవర్గ పరిధిలోని పైలెట్‌ గ్రామాలలో మినహా మిగతా చోట్ల ఎక్కడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. కానీ మట్టిదందా చేస్తున్నవారు మాత్రం తాము ఇందిరమ్మ ఇళ్ల పేరుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్లు ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తీసుకెళుతున్నారని చెబుతూ కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టిసారించి మట్టి దందాను అరికట్టి ప్రభుత్వ భూములను, గుట్టలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లోంచి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. కోదాడ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి దందా సాగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. మట్టి తవ్వకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

– సీహెచ్‌. సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ

ఫ గుట్టల్లో గుట్టుగా మట్టి తవ్వకం

ఫ రోడ్డుపక్కనే డంపుచేసి..

హోల్‌సేల్‌గా అమ్మకం

ఫ నిత్యం లక్షల్లో వ్యాపారం

ఫ పట్టించుకోని రెవెన్యూ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement