తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలపై విచారణ చేసి రికార్డులను పరిశీలించారు. రాత్రి ఏ సమయంలో ట్రాక్టర్లు, డీసీఎంలు బయటకు వెళ్లాయనే విషయాన్ని నిర్ధారించేందుకు సీసీ పుటేజీలను పరిశీలించారు. శనివారం రాత్రి ధాన్యం లోడుతో వెళ్లిన డీసీఎం ఎటువైపు వెళ్లిందనే విషయమై వివరాలు సేకరించారు. అనంతరం జలాల్‌పురం, గొట్టిపర్తి, వెంపటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు. గొట్టిపర్తి కేంద్రంలో రైతులతో మాట్లాడారు. గత యాసంగి సీజన్ నుంచి ఈ దందా సాగుతోందని రైతులు అధికారికి వివరించారు. ఈ విషయమై సేకరించిన వివరాలతో పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, సివిల్ సప్‌లై డీఎం శ్రీధర్‌రెడ్డి, డీసీఓ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, మార్కెట్ కార్యదర్శి సురేష్, డీటీసీఎస్ రాజశేఖర్, ఆర్‌ఐలు శ్రీకాంత్‌రెడ్డి, సుజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు
భానుపురి (సూర్యాపేట) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో రైతుల పేరిట విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం మార్కెట్‌ను సందర్శించి విచారించారు. మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసి ఐకేపీకి తరలిస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఇందులో కమిషన్ ఏజెంట్ సోమా ఆంజనేయులు, డ్రైవర్ మణికుమార్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అక్రమాలలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నదో తేల్చేందుకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు.
ఫ తిరుమలగిరి మార్కెట్‌లో తనిఖీలు


