సూర్యాపేటటౌన్ : యువత చెడు అలవాట్లతో తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఎస్పీ నరసింహ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాలలో పట్టణ పోలీసు, షీ టీం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖ ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం కృషి చేస్తుందన్నారు. యువత చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, స్పల్ప ఆనందం కోసం వెళితే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా మంచిని నేర్చుకోవాలని, చెడు సావాసాలు, స్నేహాలకు గురికావద్దన్నారు. బాలికలను వేధింపులకు గురి చేస్తే పోక్సో చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌ఐలు, షీ టీం బృందం పాల్గొన్నారు.


