విద్యుదాఘాతంతో మృతి
మోత్కూరు, ఆత్మకూరు(ఎం): ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరులో శనివారం జరిగింది. ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మద్దిపడిగె నర్సిరెడ్డి–శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు భాస్కర్‌రెడ్డి (23) మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్నాడు. శనివారం వైండింగ్ చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను టెస్టింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. గమనించిన తోటి వర్కర్లు కరెంట్ బంద్ చేసి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భాస్కర్‌రెడ్డి మృతిచెందాడు. రిపేరు సెంటర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే భాస్కర్‌రెడ్డి చనిపోయారని తోటి సిబ్బంది ఆరోపించారు. షెడ్డులో వర్కర్లకు సరైన రక్షణ పరికరాలు సమకూర్చడం లేదన్నారు. గతంలో రెండు సంవత్సరాల పాటు ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు సెంటర్‌లో పనిచేసి జీతం సరిపోవడం లేదని హైదరాబాద్‌కు వెళ్లిపోగా.. జీతం పెంచుతానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో తిరిగి ఇక్కడికి వచ్చినట్లు తోటి వర్కర్లు తెలిపారు. భాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భాస్కర్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం పారుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


