
చెత్తతో ఆదాయం పెంచేలా..
హుజూర్‌నగర్ : మున్సిపాలిటీలకు అదనపు ఆదా యం సమకూర్చేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటి నుంచి సేకరించే చెత్తతోపాటు దుకాణాల ద్వారా వచ్చే వ్యర్థాలకు ఇకపై పక్కాగా లెక్క ఉండేలా అధికారులు చర్యలు చేపడతారు. చెత్త పరిమాణం ఆధారంగా వాణిజ్య కేంద్రాలను విభజించనున్నారు. ప్రాంతాన్ని బట్టి వాణిజ్య కేంద్రాల్లో చెత్త పరిమాణాన్ని లెక్కించి పన్ను వసూలు చేసి మున్సిపాలిటీలకు ఆదాయం రాబట్టనున్నారు.
దుకాణ సముదాయాలకు క్యూఆర్ కోడ్
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నివాస గృహాలకు ఇదివరకే జియోట్యాగింగ్ చేపట్టి మ్యాపింగ్ చేశారు. నగరపాలికల్లో మాదిరిగా ఇకపై మున్సిపాలిటీల్లోనూ వాణిజ్య ప్రాంతాల్లోని చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం ప్రధాన రహదారికి అనుకుని ఉన్న ప్రతి దుకాణాన్ని గుర్తించి జియో ట్యాగింగ్‌లో పొందుపర్చిన లెక్కల ఆధారంగా దుకాణ సముదాయాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన నంబర్ కేటాయించనున్నారు. స్థానికత ఆధారంగా మ్యాపింగ్ చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, మాంసం విక్రయ దుకాణాలకు క్యూఆర్ కోడ్‌ను అమర్చేందుకు మున్సిపాలిటీల్లో కార్యాచరణ రూపొందిస్తున్నారు. తద్వారా ఏయే దుకాణానికి ఎంత చెత్త వస్తుందో లెక్కలు వేసి దాని పరిమాణాన్ని బట్టి పక్కాగా పన్ను విధించనున్నారు.
రోడ్ల వెంట చెత్త చేయకుండా..
మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు తెచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంబడి చెత్త ఉండకుండా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లపై చెత్త పారేయకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దుకాణాల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఫ చెత్త లెక్క పక్కాగా ఉండేలా కార్యాచరణ
ఫ మున్సిపాలిటీల్లో చెత్త పరిమాణాన్ని
బట్టి విధించనున్న పన్ను
ఫ నూతన విధానానికి యంత్రాంగం కసరత్తు
ఫ చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ
ఫ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకుల సాధనకు పోటీ
తడి చెత్తతో ఎరువుల తయారీ
మున్సిపాలిటీల్లో ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం తడి చెత్తతో ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించారు. రైతులకు అవసరమయ్యే ఎరువులను తయారు చేసి వారికి నిర్ణీత రుసుం ఇచ్చి ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్తను వేర్వేరు డబ్బాల్లో సేకరించి కేటాయించిన ట్రాక్టర్లలో ఆటోల్లో డంపింగ్ యార్డుకు తరలించాలని నిర్దేశించారు. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మురుగు కాల్వల్లో చెత్త వేయొద్దు
పట్టణాలు చెత్తమయం కాకుండా ఎవరికి వారు ఇళ్లల్లో స్వీయ నియంత్రణ పాటించాలి. చెత్తను మురుగు కాల్వల్లో వేయకుండా తడి పొడి చెత్త డబ్బాల్లో వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలి. వ్యాపార సముదాయాల వారు కడూఆ స్వచ్ఛత విషయంలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. – శ్రీనివాస్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్
రోజువారీగా వెలువడే చెత్త వివరాలు
(మెట్రిక్ టన్నుల్లో..)
మున్సిపాలిటీ వార్డులు చెత్త
సూర్యాపేట 48 55
కోదాడ 35 32
హుజూర్‌నగర్ 28 18
నేరేడుచర్ల 15 5
తిరుమలగిరి 15 5

చెత్తతో ఆదాయం పెంచేలా..