
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
చివ్వెంల(సూర్యాపేట): వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. తేమశాతం 17 రాగానే సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలన్నారు. ఈకార్యక్రమంలో నిర్వాహకురాలు చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ, అలింకో సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్యాంపుల్లో సహాయ పరికరాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డీ. జహీర్ బాబా ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 14న హుజూర్‌నగర్, 15న కోదాడ, 16న సూర్యాపేట, 17న తుంగతుర్తి లో నిర్వహించే క్యాంపుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో సదరం సర్టిఫికెట్, యూడీఐడీకార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోలు జతపర్చాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి బ్యాటరీ సైకిల్, ట్రై సైకిల్, వీల్ చైర్, చేతి, చంక కరల్రు, శ్రవణ యంత్రాలు, ప్రత్యేక మానసిక వికలాంగుల కిట్లు అందించనున్నట్లు వివరించారు.
కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కోరారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆదేశా నుసారం కాంగ్రెస్ పార్టీ కార్యాల యాలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను కోరినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఎకరం భూమి కేటాయించి ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు వెంకన్న చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం పరిశీలించాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, నాయకులు చింతమల్ల రమేష్, ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, రుద్రంగి రవి, నాగుల వాసు, అబ్దుల్ రహీం, సిరివెళ్ల శబరినాథ్, అన్నమయ్య రాము, సాయి నేత తదితరులు పాల్గొన్నారు.
14 నుంచి ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14 వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్‌టికెట్ లేదా నూతన హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని ఆయన తెలిపారు. కళాశాల గుర్తింపు కార్డు, ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి