
ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెబ్ పోర్టల్‌లో శాఖల వారీగా డిపార్ట్‌మెంట్ ప్రొఫైల్, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్, వార్షిక నివేదిక, శాఖల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారుల వివరాలు అప్డేట్ చేయాలన్నారు. ప్రతి శాఖ కార్యాలయంలో ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమించాలన్నారు. ఈ నెల 25 లోపు సంక్షేమ అధికారులు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించి, బ్యాంకు క్లియరెన్స్ ఇప్పించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వివి అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
భూభారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గ నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు , ఆర్‌ఐలు పాల్గొన్నారు.