నాలుగు గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరణ
నేరేడుచర్ల: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే చోరీకి పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించారు. ఈ ఘటన ఆదివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రాములునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ స్థానిక పశు వైద్యశాలలో అంటెండర్‌గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇస్మాయిల్ భార్య నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడలో తన పుట్టింటికి వెళ్లింది.
ఆదివారం సెలవు దినం కావడంతో ఇస్మాయిల్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాగా.. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.15వేల నగదు, 10 తులాల వెండి, 4 గ్రాములు బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే నేరేడుచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భువనగిరి బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
భువనగిరిటౌన్: భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి బస్టాండ్ పరిసరాల్లో బిక్షాటన చేస్తూ తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 38 ఏళ్లు) ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్లాట్‌ఫాం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బస్టాండ్‌కు చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిని పరిశీలించగా.. అతడు మృతిచెంది ఉన్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వీఓఏ ఆచూకీ లభ్యం
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వీఓఏగా విధులు నిర్వహిస్తున్న మిట్ట సంధ్య ఆచూకీ ఆదివారం తెలిసింది. అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంధ్య తన స్యూటీని ఆలేరు బస్టాండ్‌లో పార్కింగ్ చేసి హైదరాబాద్‌కు వెళ్లింది. హైదారాబాద్‌లోని చర్లపల్లి పరిధిలో తన చెల్లెలి ఇంటి వద్ద ఉనట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించి.. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.