అనుమతులకు మించి నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

అనుమతులకు మించి నిర్మాణాలు

May 3 2025 12:20 AM | Updated on May 3 2025 12:20 AM

అనుమతులకు మించి నిర్మాణాలు

అనుమతులకు మించి నిర్మాణాలు

సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో కొందరు గృహ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటే.. మరికొందరు ఒకటి రెండు అంతస్థులకే అనుమతి తీసుకుని అంతకుమించి అంతస్థుల నిర్మాణాలు చేపపడుతూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రం కావడంతో గృహ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు కూడా అధికమయ్యాయి. దాదాపు పట్టణంలోని సగం ఇళ్లకు అనుమతులు లేవని అధికారులు లెక్కలు సేకరించారు. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైరవీలు చేస్తున్నారు..

మున్సిపాలిటీ నుంచి గృహ యజమానులు జీ ప్లస్‌ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకుని ఆపైన ఇష్టానుసారంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన అనుమతి కన్నా అదనంగా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో అధికారులు నాలుగు నెలలుగా దాదాపుగా 30 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొందరికి నోటీసులు ఇచ్చి, ఐదారు ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా రెండేళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను నియమించినప్పటికీ రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గి క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని పట్టణ వాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో భాగంగా చాలామంది భవన నిర్మాణాలకు అనుమతులు లేకుండా సెల్లార్‌లు నిర్మిస్తున్నారు. వీటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న గృహ యజమానులు నిబంధనలను పాటించడం లేదనే చర్చ సాగుతోంది.

వీధి రోడ్లు ఇరుకుగా..

అనుమతులకు మించి అక్రమ భవనాలు ఒక ఎత్తైతే పట్టణంలో చాలా వీధుల్లో ఇంటి ముందు స్థలం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ర్యాంపులను వీధిరోడ్డు మీదికి వచ్చేలా నిర్మిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఇంటి ముందు ర్యాంపులను నిర్మిస్తుండడంతో వీధుల్లో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా వీధులగుండా ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

ఫ పర్మిషన్‌ ఇంటికి.. నిర్మించేది బహుళ అంతస్థులు

ఫ అంతర్గత రోడ్లను ఆక్రమించి ర్యాంపులు, మెట్లు ఏర్పాటు

ఫ ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ

మున్సిపాలిటీలో వార్డులు 48

నివాస గృహాలు 39,800

పట్టణ జనాభా 1,53,000

ఇటీవల గుర్తించిన

అక్రమ నిర్మాణాలు 30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement