
హుజూర్‌నగర్ పట్టణ వ్యూ
ఫ మున్సిపాలిటీల అభివృద్ధిలో కానరాని కమిటీల పాత్ర
ఫ మూడునెలలకోసారి సమావేశాల
నిర్వహణ ఊసేలేదు
ఫ పట్టింపులేని పాలకవర్గాలు, అధికారులు
హుజూర్‌నగర్: పాలకవర్గం, అధికార యంత్రాంగంతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది. వార్డుల్లో ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో, దాన్ని ఏవిధంగా పరిష్కరించాలో ప్రజల తరఫున పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారే ఈ వార్డు కమిటీల సభ్యులు. స్థానిక ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన వార్డు కమిటీలను అధికారులు పక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవి కొంత కాలంగా నిస్తేజంగా ఉండి పోయాయి.
5 మున్సిపాలిటీల్లో 141 వార్డులు..
జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 141 వార్డులు ఉన్నాయి. వాటిలో వార్డుకు 4 కమిటీలు కాగా ఒక్కో కమిటీకి 15 మంది చొప్పున మొత్తం 8,460 మంది సభ్యులు ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు 2,880 మంది, కోదాడలో 35 వార్డులకు 2,100 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు 1,680 మంది , తిరుమలగిరిలో 15 వార్డులకు 900 మంది, నేరేడుచర్లలో 15 వార్డులకు 2,880 మంది కమిటీ సభ్యులు ఉన్నారు.
ఒక్కో వార్డుకు 4 కమిటీలు..
15 మంది సభ్యులు
ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు ఉంటాయి. మొదటి కమిటీలో స్థానిక యువత, రెండో కమిటీలో మహిళలు, మూడో కమిటీలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. నాలుగో కమిటీలో పుర ప్రముఖులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉంటారు. మున్సిపాలిటీల్లో జనాభాను బట్టి వార్డులు విభజిస్తారు. ఒక్కో వార్డుకు 4 కమిటీలు ఉంటాయి. ఒక్కో కమిటీకి 15 మంది సభ్యుల చొప్పన ఒక్క వార్డుకు 60 మంది సభ్యులు ఉంటారు. వీరితో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి కమిటీ సభ్యుల సూచనలతో ఆయా వార్డుల్లో పనులు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా వార్డు కమిటీ సభ్యులతో చర్చించి పాలకవర్గం అమోదించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అందుకే ఆయా కమిటీల్లో ఎంపికై న వారు స్థానిక సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, సాధారణ మరమ్మతులు వంటి అంశాలను పరిష్కరించేందుకు వార్డు కమిటీల సమావేశాలు జపాలి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కమిటీలు నామమాత్రంగా మారాయి. ఇకనైనా వాటి పనితీరులో మార్పు రావాలని పురప్రజలు కోరుతున్నారు.
వార్డు కమిటీలను చైతన్యవంతం చేస్తాం
మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కమిటీలతో గత సెప్టెంబర్‌లో సమావేశాలు నిర్వహించాం. వార్డు అభివృద్ధి విషయమై వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించాం. మరోసారి సమావేశాలు నిర్వహించడంలో కొంత ఆలస్యం అయింది. ప్రతి మూడు నెలలకు ఒక సారి సమావేశాలు నిర్వహిస్తాం. నిస్తేజంగా ఉన్న వార్డు కమిటీలను చైతన్యవంతం చేస్తాం.
– కె. శ్రీనివాసరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్
