
పరీక్ష రాసేందుకు డీసీఎంలో తుంగతుర్తికి వెళుతున్న విద్యార్థులు (ఫైల్)
నాగారం: జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఏటా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏడేళ్లవుతున్నా పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఊసేలేదు. జిల్లాలో 2016లో నాగారం, మద్దిరాల, అనంతగిరి, చింతలపాలెం, పాలకవీడు ఐదు మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ మండలాల్లో 26 జెడ్పీహెచ్‌ఎస్‌లు, మూడు కేజీబీవీలు, ఎనిమిది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల నుంచి ఈ ఏడాది 1,019 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. స్థానికంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. బస్సులు లేదా ఇరత ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. మారుమూల గ్రామాల్లో ఉదయం వేళల్లో బస్సు సౌకర్యం లేని పల్లెలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి చోట్ల నడిచివెళ్లాల్సి వస్తోంది. పరీక్ష కేంద్రాలు పది కిలోమీటర్ల కంటే దూరంగా ఉండటంతో వేళకు చేరుకోవడం ఒక సమస్య అయితే...రాకపోకలకు సమయం వృథా అవుతుందని, పైగా ఆలస్యమైతే కేంద్రాల్లోకి అనుమతి ఉండదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త మండలాల్లో పరిస్థితి ఇదీ..
● నాగారం మండలంలో ఆరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, ఒక మోడల్ స్కూల్, ఒక ప్రైవేట్ పాఠశాల ఉన్నాయి. ఈ స్కూళ్ల నుంచి ఈ ఏడాది 220 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మండలానికి చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షల కోసం మూడు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పసునూర్, పస్తాల, శాంతినగర్, లక్ష్మాపురం గ్రామాల విద్యార్థులు తుంగతుర్తిలో, నాగారం, నాగారంబంగ్లా, వర్థమానుకోట, మాచిరెడ్డిపల్లి, డి.కొత్తపల్లి, పేరబోయినగూడెం, నర్సింహులగూడెం గ్రామాల విద్యార్థులు జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో, ఫణిగిరి, ఈటూరు, మామిడిపల్లి గ్రామాల విద్యార్థులు తిరుమలగిరి మండల కేంద్రంలో పది పరీక్షలు రాయనున్నారు. దీంతో విద్యార్థులు సుమారు 8 నుంచి 10 కి.మీపైగా దూరం ప్రయాణించాల్సి ఉంది. పలు గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు.
● అననంతగిరి మండలంలో 7 జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 264 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. అయితే గొండ్రియాల జెడ్పీహెచ్‌ఎస్‌లో 22 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు వార్షిక పరీక్షలు రాయడానికి 13 కి.మీ దూరంలో ఉన్న కోదాడకు వెళ్లాలి. సరైన రవాణా సౌకర్యం లేక కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల బైక్‌లపై, మరికొందరు ఆటోలపై, ఇంకొందరు కాలినడకన వెళ్లాల్సి వస్తుంది.
● పాలకవీడు మండలంలో 3 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 1 కేజీబీవీ, 1 ప్రైవేట్ పాఠశాల ఉన్నాయి. ఈ పాఠశాలల నుంచి మొత్తం 122 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యార్థులు నేరేడుచర్ల మండల కేంద్రానికి పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. మండలం నుంచి బస్సు సౌకర్యం లేదు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆటోలు ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లనున్నట్లు ఎంఈఓ చత్రునాయక్ తెలిపారు.
చింతలపాలెం మండలంలో 3 జెడ్పీ ఉన్నత పాఠశాలలు , ఆరు ప్రైవేట్ హైస్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 285 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో తమ్మారం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి 49 మంది, చింతపాలెం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి 28 మంది, ఇక్కడి రెండు ప్రైవేట్ పాఠశాలల నుంచి 99 మంది , దొండపాడు హైస్కూల్ నుంచి 33మంది, ఇక్కడి నాలుగు ప్రైవేట్ పాఠశాలల నుంచి 76 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. స్థానికంగా పరీక్షా కేంద్రం లేక పక్క మండలమైన మేళ్లచెరువుకు వెళ్లాల్సి వస్తుంది. అసలే చివరి మండలం కావడంతో ఇక్కడి నుంచి ఆర్టీసీ, ఇతర ప్రై వేట్ వాహనాల సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది.
ఫ కొత్త మండలాల్లో పదో తరగతి
పరీక్ష కేంద్రాలు లేక పాట్లు
ఫ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సిందే
ఫ రవాణా సౌకర్యంలేక తప్పని ఇబ్బందులు
ఫ ఏప్రిల్3 నుంచి పదో తరగతి పరీక్షలు
ఈ ఫొటోలో కన్పిస్తున్న విద్యార్థిని పేరు గుర్ర శ్రీజ. మద్దిరాల మండలం కుక్కడం జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతోంది. మద్దిరాల మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో పరీక్ష రాయాలంటే రానుపోను తుంగతుర్తికి 26 కి.మీ. ప్రయాణం చేయాల్సిందే. సమయానికి బస్సుసౌకర్యం
ఉండదు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాలి. ఇవీ కొత్త మండలాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రం లేక విద్యార్థుల పడే ఇబ్బందులకు నిదర్శనం.
పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు మౌలిక వసతులు ఉండాలి
పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలంటే విద్యార్థుల సంఖ్య కనీసం 100 నుంచి 150 మధ్య ఉండాలి. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు తరగతి గదులతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలి. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల వివరాలు తీసుకొని ఆరు నెలల ముందే రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి నివేదించాం. విద్యార్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు కేటాయించారు.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట.
మద్దిరాల మండలంలో 7 జెడ్పీహెచ్‌ఎస్, 1 కేజీబీవీ ఉన్నాయి. ఈ పాఠశాలల పరిధిలో 150 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మండల విద్యార్థులకు స్థానికంగా పరీక్ష కేంద్రం లేక తుంగతుర్తి, నూతనకల్ మండలాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తుంది. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మరికొందరు విద్యార్థులను తల్లిదండ్రులు వారి పనులు మానుకొని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది.

పాలకవీడులో అవగాహన కల్పిస్తున్న డీపీఓ యాదయ్య

