రాజాపేట : బీఆర్‌ఎస్ పార్టీతో ఉనికి కోల్పోతామని నరేంద్రమోదీ ప్రభుత్వం కేసీఆర్‌ను అణచివేసే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి నరేంద్రమోదీలు ఎందరు వచ్చినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపురంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండాపోయిందని, మాట్లాడితే కేసులు పెడుతున్న బీజేపీని బొందపెట్టాలని అన్నారు. ప్రశ్నించిన రాహులు గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామకమన్నారు. ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రతోనే ఈడీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రోజుల తరబడి విచారణ పేరుతో కేసీఆర్‌ను, కవితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ భారత దేశంలో ఇతర పార్టీ ఉండకుండా మోదీ ముందుకు సాగుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా దెబ్బతీయ్యాలని చూస్తున్నారని అన్నారు.