జిల్లాలో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణ, మౌలిక వసతుల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, ఎస్. మోహన్‌రావు లతో కలసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రెగ్యులర్ 12,221 మంది, ప్రైవేట్ 165 మంది మొత్తం 12,386 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, వీరికి 69 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల ఉన్న రూట్‌లలో పరీక్షల సమయంలో ఆర్‌టీసీ బస్సులు నడపాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, డీఎస్పీ రవి, విద్యుత్ , వైద్య , పోస్టల్, ఆర్‌టీసీ, ట్రెజరీ శాఖల అధికారులు పాల్గొన్నారు.