శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు డీఎస్పీగా ఎన్.భాస్కర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్‌ఎస్‌లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్‌పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్‌ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్‌కు డీఎస్పీగా బి.రాజశేఖర్ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి.
బీచ్ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్‌లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.
పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్
పాతపట్నం: పోక్సో కేసు నిందితుడైన అంతరాబ గ్రామానికి చెందిన యాగాటి జయరాంకు పాతపట్నం మెజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని అంపోలులోని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు.
విద్యుత్ తీగ తెగిపడి మూగజీవి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: పెదబాడాం–గుళ్లలపాడు గ్రామాల మధ్య 33 కేవీ విద్యుత్ తీగలు సోమవారం సాయంత్రం తెగి పడటంతో మూగజీవి మృత్యువాత పడింది. నగరంపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు దువ్వాడ పున్నయ్య తాను పెంచుకుంటున్న మూగ జీవాలను పంట పొలాల వైపు మేతకు తీసుకువెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో విద్యుత్ తీగ పడటంతో ఎద్దు మృతి చెందింది. సుమారు రూ. 40 వేలు నష్టం కలిగినట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరాడు.
వేతనాలు పెంచాలని కార్మికుల నిరసన
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఆంధ్రా ఆర్గానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్‌గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పండుగ, జాతీయ సెలవులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మద్దతు తెలిపారు.


