
గుండెల్లో గుబులు!
మాస్టర్ ప్లాన్‌తో..
2017లో తయారుచేసిన శ్రీకాకుళం మాస్టర్ ప్లాన్‌కు తాజాగా ఆమోదం
150 అడుగుల రింగ్ రోడ్డుతో పలు
ఆస్తులకు ముప్పు
2047 వరకు నిర్మాణాలు, అమ్మకాలు జరపలేని పరిస్థితి!
శ్రీకాకుళం:
జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్ కలకలం రేగింది. పెదపాడు నుంచి అరసవల్లి, కాజీపేట, 80 అడుగుల రోడ్డు, పొన్నాడ వంతెన మీదుగా నవభారత్ జంక్షన్ వరకు 150 అడుగుల రోడ్డుకు 2017లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కొన్ని కొన్ని సవరణలు చేస్తూ 2020లో ప్రభుత్వానికి నివేదించారు. అటు తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్లాన్‌కు ఆమోదిస్తూ 2020 నుంచి 2047 వరకు ఈ ప్లాన్ లో పొందుపరిచిన రోడ్డు పరిధిలో ఉన్న స్థలాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఉండవని, ఆ పరిధిలో ఉన్న స్థలాలను రోడ్డు కోసం సేకరిస్తామని చెబుతూ ఉత్తర్వులు వెలువడించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే విషయమై చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఇటువంటి మాస్టర్ ప్లాన్ ఆమోదించే ముందు సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే కూటమి ప్రభుత్వం ఆమోదించేసింది. ఇప్పుడు ఈ ప్లాన్ అమలు చేయాలంటే 2023లో నిర్మాణానికి అనుమతించిన 80 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి పాక్షికంగా, ఆ పక్కనే నిర్మితమైన అపార్ట్‌మెంట్‌లో సగానికి పైభాగం కూల్చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలోని ఓ లేఔట్‌లో మూడు అపార్ట్‌మెంట్లు సైతం కూల్చాల్సిన పరిస్థితి. ఇక్కడే ఉన్న పెద్దమ్మతల్లి, రామ మందిరం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.
పెదపాడు నుంచి పొన్నాడ వంతెన వద్ద వచ్చే వరకు పలు భవనాలను కూడా ప్రభుత్వం సేకరించి రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన పరిధిలో ఉన్న స్థలాల్లో 2047 వరకు నిర్మాణాలు చేసే పరిస్థితి ఉండదు. అటువంటి అప్పుడు నగరపాలక సంస్థ అధికారులు లేఅవుట్లకు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోడ్డు పరిధిలో ఉన్న స్థలాల యజమానులు, ఇళ్లు ఉన్న యజమానులు, ఇంటి నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదే విషయమై వారం రోజులుగా కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వారంతా రాష్ట్రస్థాయికి నివేదిస్తామంటున్నారు తప్ప కచ్చితమైన హామీలు ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసినా న్యాయం జరుగుతుందో లేదోనన్న అపనమ్మకంతో వారంతా ఉంటున్నారు. విశాఖపట్నం వంటి మహానగరంలోనే 150 అడుగుల రోడ్లు లేవని, శ్రీకాకుళం వంటి నగరానికి అవసరమా అని వారందరూ ప్రశ్నిస్తున్నారు.
2047 వరకు అనుమతుల్లేవ్..
మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రూపొందించినా ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే ఆమోదించారు. ఇది వెంటనే అమలైపోయే అంశం కాదు. అయితే మాస్టర్ ప్లాన్‌లోని రోడ్ల పరిధిలో ఉంటే ఆయా స్థలాల్లో నిర్మాణాలకు 2047 వరకు అనుమతులు ఇవ్వరు.
– ప్రసాదరావు, కమిషనర్, నగరపాలక సంస్థ

గుండెల్లో గుబులు!