
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఎచ్చెర్ల : పొన్నాడ బ్రిడ్జి రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముద్దాడ నవీన్ (19) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం కలివరం పంచాయతీ ముద్దాడపేటకు చెందిన నవీన్ గతేడాది పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాడు. పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చి స్నేహితుడి బైక్ తీసుకుని ఎచ్చెర్ల మండలం పొన్నాడ వైపు వచ్చాడు. రాత్రి 12 గంటల సమయంలో పొన్నాడ నుంచి శ్రీకాకుళంవైపు వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.
చెరువులో మునిగి యువకుడు మృతి
నరసన్నపేట: కామేశ్వరిపేటలో శనివారం విషాదం అలుముకుంది. ఉదయం స్నానానికి దిగిన కనుగుల దామోదరరావు(37) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. వర్షాలకు గుమ్మన చెరువులో నీరు బాగా చేరింది. ఎప్పట్లాగే స్నానానికి దిగిన దామోదరరావు లోపలికి వెళ్లిపోయాడు. ఒక్కసారి మునిగిపోవడం, ఈత రాకపోవడంతో చేతులు పైకెత్తి కేకలు వేశాడు. దూరంగా ఉన్న వారు గమనించి చెరువులో దిగి ఆయన్ను బయటకు తీశారు. అప్పటికే చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లి రామమ్మ నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామోదరరావుకు వివాహం కాలేదు. తల్లి వద్దనే ఉంటున్నాడు. తండ్రి గతంలోనే మృతి చెందారు. ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దామోదరరావు మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, కోట జోగినాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీకి చెందిన బరాటం ప్రసాదరావు (68) రణస్థలం మండలంలోని కోష్టలో పాన్‌షాప్ నడుపుతూ అక్కడే నివాసముంటున్న కుమారుడు శ్రీనివాసరావు వద్దకు బయలుదేరాడు. శనివారం ఉదయం రణస్థలంలో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సోషల్ మీడియాలో ఫొటో చూసి కుమారుడు, బంధువులు గుర్తుపట్టి రిమ్స్‌కు చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి ఈశ్వరరావు (48) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల సత్యనారాయణ ప్రవర్తనలో తేడా రావడంతో కుమార్తె, కుమారుడు నిలదీశారు. కోపోద్రుక్తుడైనా ఈశ్వరరావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును శుక్రవారం తాగాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతదేహన్ని రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయితో వ్యక్తి అరెస్టు
టెక్కలి రూరల్: టెక్కలి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టెక్కలి ఎస్‌ఐ రాము తెలిపారు. బీహార్‌కు చెందిన ఎండీ స్వామన్ 640 గ్రాము ల గంజాయి తీసుకుని ట్రైన్‌లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
హిజ్రాల దారిదోపిడీ
నరసన్నపేట: ఉర్లాం–నడగాం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కొందరు హిజ్రాలు కారులో వచ్చి దారిదోపిడీకి పాల్పడ్డారు. నడగాంకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ దొంపాక ఆనంద రమణ మెడలో బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. ఉర్లాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నడగాం రైల్వేగేటు దాటిన తర్వాత రోడ్డుపై కాచి ఉన్న ఐదుగురు హిజ్రాలు వాహనాన్ని ఆపి డబ్బులు అడిగారని ఆనంద రమణ తెలిపారు. ఇవ్వకపోవడంతో మెడలో తులంన్నర బంగారు చైన్ లాక్కెళ్లిపోయారని, ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం