
తండ్రి మందలించాడని..
బూర్జ : సెల్‌ఫోన్ పోయిందని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన బూర్జ గ్రామానికి చెందిన గుడిదాపు మణి(33) ఈ నెల 1న కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మణి గతంలోనూ కుటుంబ కలహాల నేపథ్యంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య లలితకుమారి, రెండేళ్ల కుమారుడు సోహిత్ ఉన్నాడు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో సచివాలయ ఉద్యోగి మృతి
జలుమూరు/టెక్కలి రూరల్: టెక్కలిపాడు సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మామిడి సురేష్ (34) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కోటబొమ్మాళి సబ్ డివిజన్‌లోని కిష్టుపురం వద్ద విద్యుత్ లైన్‌కు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా పక్కనే ఉన్న 11 కె.వి.లైన్ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స చేసి కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ స్వగ్రామం పాగోడు. తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, సచివాలయం పరిధిలో ఉన్న ఉద్యోగికి వేరే మండలంలో ఎలా డ్యూటీలు వేస్తారని గ్రామ సర్పంచ్ దామ మన్మధరావుతోపాటు కుటుంబ సభ్యులు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సురేష్ మృతితో పాగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

తండ్రి మందలించాడని..